Iran : అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఇవాళ్టితో ముగిసింది. అయినా ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధం వీడలేదు. ఏప్రిల్ 8న కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొన్ని రోజులు పొడిగించుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను ఇరాన్ పెద్దగా పట్టించుకోవడంలేదు. హర్మూజ్‌లో తమ నౌకలపై అమెరికా దిగ్బంధనాన్ని తొలగిస్తేనే తాము చర్చలకు వస్తామని తెగేసి చెప్పింది.
ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో రెండోవిడత చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని పేర్కొన్నారు. అయితే హర్మూజ్‌లో తమ నౌకలపై కొనసాగుతోన్న దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయాలని షరతు విధించారు. తమ నౌకలను దిగ్బంధించడంతో.. అమెరికా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని ఇరావానీ అన్నారు.
దిగ్బంధనాన్ని తొలగించాలని తాము అమెరికాను అడిగామని, అందుకు అమెరికా కూడా సిద్ధంగా ఉన్నట్లు తమకు కొన్ని సంకేతాలు అందాయని ఇరావానీ అన్నారు. దిగ్బంధనం తొలగించిన వెంటనే.. ఇస్లామాబాద్‌లో చర్చలు ప్రారంభమవుతాయన్నారు. అమెరికా చర్చలు కాకుండా యుద్ధం చేయాలని అనుకుంటే అందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.