NASA | అవకాశం వస్తే బోయింగ్ స్టార్ లైనర్‌లో మరోసారి ఐఎస్ఎస్కు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నామని నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రకటించారు. స్టార్‌లైనర్ క్యాప్సూల్ గతేడాది జూన్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడే చిక్కుకుపోగా.. దాదాపు తొమ్మిది నెలల తర్వాత స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ వారిద్దరిని భూమిపైకి తీసుకువచ్చింది. హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మాట్లాడారు. మిషన్ విజయవంతం అయ్యేందుకు సహకరించిన నాసాకు ధన్యవాదాలు తెలిపింది. గతంలో తీసుకున్న ట్రైనింగ్ తమను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లేలా సిద్ధం చేసిందని.. దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ బృందాలు తాము తిరిగి తమను భూమిపైకి తీసుకురావడం, పునరావాసం, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎంతో సహకారం అందించారన్నారు. తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే మూడు మైళ్ల దూరం పరుగెత్తానన్నారు. స్పేస్ నుంచి భూమిపైకి వచ్చాక కొన్ని మార్పులు ఉంటాయని.. అందుకు తగినట్లుగా సర్దుబాట్లు అవసరమవుతాయన్నారు. తాను సాధారణ స్థితికి వచ్చేందుకు సహకరించిన ట్రైనర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో తమ టాస్క్‌ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. స్టార్‌లైనర్‌కు చాలా సామర్థ్యం ఉందని, అది విజయవంతం కావాలని ఆమె కోరుకుంటున్నట్లు విలియమ్స్ తెలిపారు. బుచ్ విల్మోర్ మాట్లాడుతూ.. బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో తప్పులు ఉన్నాయని.. తాము ఎదుర్కొన్న సమస్యలన్నింటిని పరిష్కరించి.. విజయవంతం చేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. సునీతా విలియమ్స్, విల్మోర్ ఇద్దరూ ఐఎస్ఎస్లో 286 రోజుల పాటు ఉండిపోయారు. షెడ్యూల్ చేసిన సమయం కంటే 278 రోజులు ఎక్కువ కావడం విశేషం. జూన్ 5న బోయింగ్ తొలి స్పేస్‌షిప్‌లో ఐఎస్ఎస్కు వెళ్లారు. ఆ తర్వాత థ్రస్టర్స్ పని చేయకపోవడం, హీలియం లీక్ తదితర సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. దాంతో నాసా స్టార్‌లైనర్‌లో వారిని తీసుకురావడం చాలా ప్రమాదకరమని భావించింది. చివరకు స్పేస్ఎక్స్ సహాయం తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. దాంతో ఇద్దరిని భూమిపైకి తీసుకురావడం ఆలస్యమైంది. వారం రోజుల అంతరిక్ష యాత్ర దాదాపు 286 రోజులు సాగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పేస్ఎక్స్, ఎలోన్ మస్క్‌ని మిషన్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరారు. మార్చి 18న ఫ్లోరిడా తీరంలో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ వ్యోమగాములను భూమిపై విజయవంతంగా దింపింది.