
ఐరాస సభలో అమెరికా అధ్యక్షుడు బైడెన్
ఐరాస, సెప్టెంబర్ 21: చైనాతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని అమెరికా కోరుకోవడం లేదన్నారు. ప్రపంచ దేశాలు రెండు భిన్న ధ్రువాలుగా విడిపోవాలని కూడా అనుకోవడం లేదన్నారు. చైనా పేరును ప్రస్తావించకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (యూఎన్జీఏ)లో మంగళవారం ప్రసంగించిన బైడెన్.. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకోవడంపై వస్తున్న విమర్శలపై కూడా స్పందించారు. దౌత్యపరంగా ఇకపై తాము అత్యంత కఠిన నిర్ణయాలను తీసుకోబోతున్నట్టు పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామన్నారు.