మాస్కో, సెప్టెంబర్ 5: ఉక్రెయిన్‌తో రెండేళ్లకు పైగా యుద్ధం సాగిస్తున్న రష్యా తాజాగా శాంతిచర్చలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉక్రెయిన్ సంక్షోభంపై తాము భారత్ సహా చైనా, బ్రెజిల్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ గురువారం తెలిపారు. ఈ మూడు దేశాలు ఈ సంక్షోభ నివారణకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నాయని, మాస్కో-కీవ్ మధ్య శాంతియుత చర్చలకు అవి మధ్యవర్తిత్వం వహించగలవని పుతిన్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వ్లాడివ్స్టోక్లో జరిగిన ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరమ్ (ఈఈఎఫ్) ప్లీనరీ సెషన్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుత సంక్షోభంపై చర్చలు జరపాలని ఒకవేళ ఉక్రెయిన్ కోరుకుంటే దానికి నేను సిద్ధమే’ అని శాంతి చర్చలకు తన సమ్మతి తెలిపారు. కాగా, రెండు వారాల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపిన అనంతరం పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.