మాస్కో: అణ్వాయుధాల(Nuclear Weapons) వాడకం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఏ సమయంలో ఎప్పుడు, ఎందుకు అణ్వాయుధం వాడుతామో ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అణ్వాయుధ రహిత దేశం నుంచి తమపై దాడి జరిగితే, ఆ దాడికి అణ్వాయుధ దేశం మద్దతు ఇస్తే, దాన్ని సంయుక్త దాడిగా పరిగణిస్తామని, ఆ సందర్భంలో తాము అణ్వాయుధాన్ని వాడనున్నట్లు పుతిన్ తెలిపారు.
ఉక్రెయిన్ అణ్వాయుధ రహిత దేశమని, ఒకవేళ ఆ దేశం కనుక అణు దాడిలో పాల్గొంటే, దానిపై న్యూక్లియర్ వెపన్ ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు. పశ్చిమ దేశాలు అందిస్తున్న లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఒకవేళ ఉక్రెయిన్ వాడితే, అప్పుడు ఆ దేశంపై అణు బాంబుతో దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు.
బుధవారం నేషనల్ సెక్యూర్టీ కౌన్సిల్ ఉన్నతాధికారులతో చర్చించిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఒకవేళ రష్యాపై భారీ స్థాయిలో మిస్సైల్ లేదా వైమానిక దాడి జరిగితే, దాని గురించి సమగ్రమైన సమాచారం అందితే, అప్పుడు అణ్వాయుధాన్ని వాడుతామని అన్నారు. రష్యాతో పాటు మిత్రదేశమైన బెలారస్‌పై కూడా దాడి జరిగితే తిప్పికొడుతామన్నారు.
శత్రు దేశాలు ఒకవేళ బాలిస్టిక్ లేదా క్రూయిజ్ మిస్సైళ్ల, లేదా వ్యూహాత్మక వైమానిక దాడి, డ్రోన్లను వినియోగించినా.. ఆ దేశాలపై అణ్వాయుధాలతో అటాక్ చేయనున్నట్లు పుతిన్ తెలిపారు. అయితే తాము ప్రకటించిన కొత్త అణు సిద్ధాంతం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయాన్ని మాత్రం పుతిన్ స్పష్టం చేయలేదు.