Strait Of Hormuz : హార్ముజ్ జలసంధి వద్ద నౌకలపై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. కార్గో నౌకలపై కాల్పులు జరిపి, ఆ నౌకల్ని ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ నావికా దళం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోను ఇరాన్ తాజాగా విడుదల చేసింది. హార్ముజ్‌లో మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసింది. మొదటగా నౌకలపై కాల్పులు జరిపింది. ఆ తర్వాత నౌకలోకి ప్రవేశించిన సైన్యం.. వాటిని తమ నియంత్రణలోకి తీసుకుంది.
అనుమతి లేకుండా, అక్రమంగా హార్ముజ్ దాటేందుకు ప్రయత్నించినందునే తాము ఈ పని చేశామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. దాడికి గురైన నౌకల్లో ఒక నౌక ఇండియాలోని గుజరాత్ రావాల్సి ఉంది. లైబీరియాకు చెందిన ఎపామినోండాస్ అనే నౌక దుబాయ్ నుంచి ఇండియా వస్తుండగా, ఇరాన్ స్వాధీనం చేసుకుంది. నౌకలపై కాల్పులు జరపడంతో ఒక నౌక స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. నౌకను సైన్యం స్వాధీనం చేసుకున్న తీరు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నట్లు ఉంది. సాయుధులైన సైనికులు.. ముసుగులు ధరించి, పడవలో కార్గో షిప్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత నిచ్చెన సహాయంతో పడవలోకి చేరుకున్నారు. నౌకను స్వాధీనం చేసుకున్నారు.
🇮🇷🚨 Iranian state media has released footage showing its forces boarding and seizing two MSC container ships near the Strait of Hormuz, in a dramatic escalation in the busy shipping corridor. pic.twitter.com/fUYqNvX6Kc
— Flashpoint OSINT (@OkosOstan) April 23, 2026
ఇది అత్యంత సాహసోపేతంగా జరిగినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం మొత్తాన్ని ఇరాన్ సైనికులు వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను ఇరాన్ అధికారిక మీడియా గురువారం విడుదల చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. అయితే, తమ నౌకను ఇరాన్ సీజ్ చేయడాన్ని పనామా ఖండించింది. ఇక.. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య శుక్ర వారం చర్చలు జరిగే అవకాశం ఉంది.