ఓస్లో: నార్వే రాజధాని ఓస్లోలో ఉన్న ఎంబసీని మూసివేస్తున్నట్లు వెనిజులా ప్రకటించింది. వెనిజులాకు చెందిన ప్రతిపక్ష నేత మారియా కొరినా మాచడోకు నోబెల్ కమిటీ శాంతి పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వెనిజులా ప్రభుత్వంపై మాచడోకు ఇచ్చిన ప్రైజ్ విషయాన్ని తన ప్రకటనలో ప్రస్తావించలేదు. విదేశాంగ విధానంలో మార్పులు తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు పాల్పడినట్లు వెనిజులా ప్రభుత్వం చెప్పింది. వెనిజులా తీసుకున్న నిర్ణయాన్ని నార్వే విదేశాంగ మంత్రిత్వశాఖ ఖండించింది. ఆ దేశం ఎటువంటి కారణాన్ని చూపలేదన్నారు.
వెనిజులా ప్రజల్లో ప్రజాస్వామ్య హక్కుల గురించి చైతన్యం తీసుకువచ్చిన ప్రతిపక్ష నేత మారియాకు నోబెల్ కమిటీ అవార్డు ప్రకటించింది. దేశాధ్యక్షుడు నికోలస్ మాడురోకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారు. వెనిజులా తీసుకున్న నిర్ణయాన్ని నార్వే తప్పుపట్టింది. అనేక అంశాల్లో విభేధాలు ఉన్నా.. వెనిజులాతో చర్చలకు నార్వే సిద్ధంగా ఉందని, ఆ దిశగా పనిచేస్తామని ప్రతినిధి తెలిపారు. నోబెల్ ప్రైజ్‌కు, ప్రభుత్వానికి తేడా ఉందని, నార్వే ప్రభుత్వానికి ఆ ప్రైజ్‌తో సంబంధంలేదని ప్రతినిధి చెప్పారు.