Trump – Machado | నోబెల్ శాంతి పురస్కారం అందుకోవాలన్న ట్రంప్ కల ఎట్టకేలకు నెరవేరింది. గురువారం నాడు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అది ఆయనకు నోబెల్ కమిటీ ఇచ్చిన అవార్డు కాదు.. వెనెజువెలా విపక్ష నేత మారియా కొరీనా మచాడో ఇచ్చింది. తాను అందుకున్న నోబెల్ శాంతి బహుమతిని ఆమె ట్రంప్‌నకు ఇచ్చేశారు. గురువారం ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో భేటీ అయిన సమయంలో నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్‌కు ఆమె అందజేశారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని మచాడోనే స్వయంగా వెల్లడించారు.
నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడానికి తాను అర్హుడిని అని డోనాల్డ్ ట్రంప్ గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మచాడో నోబెల్ పురస్కారం గెలుచుకున్నప్పుడు కూడా ఆమె నాయకత్వ సామర్థ్యంపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడికి నేను నోబెల్ శాంతి పురస్కారాన్ని అందజేశానని తెలిపారు. ఈ సందర్భంగా చారిత్రక ఘటనను ఉదాహరించారు. అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఫ్రెంచ్ సైనికాధికారి మార్క్విస్ డి లాఫాయెట్.. వెనెజువెలా విమోచకుడు సిమోన్ బొలివార్కు పతకం అందజేశారని గుర్తుచేశారు. రెండు శతాబ్దాల తర్వాత ఇప్పుడు బొలివార్ ప్రజలు వాషింగ్టన్ వారసుడిగా భావించే వ్యక్తికి ఈ పురస్కారాన్ని తిరిగి అందజేస్తున్నారని వ్యాఖ్యానించారు.
వెనెజువెలా ప్రజల సంక్షేమం కోసం ట్రంప్ చేస్తున్న కృషికి గుర్తుగా తనకు వచ్చిన నోబెల్ శాంతి పురస్కారాన్ని అందజేశానని మచాడో తెలిపారు. వెనెజువెలా ప్రజల స్వేచ్ఛ సాధన కోసం ట్రంప్ చేస్తున్న కృషిపై తమకు విశ్వాసం ఉందని తెలిపారు. వెనెజువెలా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను ఆయన అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ పురస్కారాన్ని ట్రంప్ తన వద్దే ఉంచుకున్నారా? లేదా అన్న విషయంపై మాత్రం ఆమె స్పష్టత ఇవ్వలేదు. అయితే నిబంధనలకు ప్రకారం ఒకరికి అందజేసిన పురస్కారాన్ని మరొకరికి బదిలీ చేయడం, ఇతరులతో పంచుకోవడం కుదరదని గతంలోనే నోబెల్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. విజేత పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొంది.
వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య అనంతరం అక్కడ పరిణామాలు మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలోనూ మచాడోకు ట్రంప్ మద్దతు ప్రకటించలేదు. వెనెజెవెలాను నడిపేంత శక్తి మచాడోకు లేదని వ్యాఖ్యానించి, తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌కు మద్దతునిచ్చారు. తాజాగా జరిగిన సమావేశంలోనూ డెల్సీతో కలిసి పనిచేస్తానని ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది.