Venezuela earthquake : వెనెజువెలా (Venezuela) ను కుదిపేసిన రెండు వరుస భూకంపాలు (Earthquakes) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జూన్ 24న సెకెన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతగల రెండు శక్తిమంతమైన భూకంపాలు వెనెజువెలాను కుదిపేశాయి. ఈ జంట భూకంపాల కారణంగా సంభవించిన మరణాల సంఖ్య దాదాపు వెయ్యికి చేరువైనట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా మూడు వేల మందికిపైగా గాయపడ్డారని, మరో 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియకుండా పోయారని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. రాజధాని కారకస్, లా గువేరా, యరాకుయ్, కారబోబో ప్రాంతాల్లో భారీ స్థాయిలో నష్టం జరిగింది. వందలాది భవనాలు కూలిపోగా, రహదారులు, వంతెనలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్, సమాచార వ్యవస్థలు కూడా పలు ప్రాంతాల్లో నిలిచిపోయాయి.
అమెరికా జియాలజికల్ సర్వే అంచనా ప్రకారం.. గత 125 ఏళ్లలో వెనెజువెలాలో సంభవించిన అత్యంత శక్తిమంతమైన భూకంపాలు ఇవే. కాగా తీవ్రంగా నష్టపోయిన వెనెజువెలాను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. పలు దేశాలు సహాయక బృందాలను, వైద్య సిబ్బందిని, అత్యవసర సహాయ సామగ్రిని పంపిస్తున్నాయి. భారత సైన్యం కూడా ‘ఆపరేషన్ అమిస్తాద్’ పేరుతో వైద్య బృందాన్ని వెనెజువెలాకు పంపుతోంది.