Antony Blinken | సైనిక శక్తిని పెంపొందించుకుంటూ ఒకవైపు, రష్యాకు దగ్గరగా వస్తూ మరోవైపు చైనా శరవేగంగా విస్తరించడంపై అమెరికా నిశితంగా పరిశీలిస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ చెప్పారు. చైనా కదలికలపై అమెరికాసహా నాటో సభ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. ఇదే సమయంలో బీజింగ్ ఎదుర్కొంటున్న సైనిక సవాళ్లను కూడా నాటో పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. నాటో సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బ్లింకెన్ మాట్లాడారు.
చైనా అనుసరిస్తున్న విధానాలు కలవరపెడుతున్నాయని ఆంథోనీ బ్లింకెన్ అన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, అంతే కాకుండా సైనిక శక్తిని పెంచుకుంటున్న వేగంపై కూడా నిఘా ఉంచామని చెప్పారు. రష్యాతో కుమ్మక్కైన విషయం ఏనాడో గుర్తించామని, అయినప్పటికీ చైనాతో మాట్లాడుతామన్నారు. రష్యా, చైనాలకు చెందిన యుద్ధ విమానాలు జపాన్ సముద్ర సరిహద్దు వద్ద ఇటీవల సైనిక విన్యాసాలు నిర్వహించారు. అలాగే, రెండు చైనీస్, 6 రష్యా యుద్ధ విమానాలు దక్షిణ కొరియా సమీపంలో ప్రయాణించాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
చైనా 2035 నాటికి 1500 అణ్వాయుధాలను తయారు చేయాలని భావిస్తున్నదని రెండు రోజుల క్రితం పెంటగాన్ నివేదిక ఒకటి వెల్లడించింది. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్పై దాడికి ముందు రష్యా, చైనాలు సైనిక ఒప్పందం కూడా చేసుకోవడం అమెరికాను కలవరపెడుతున్న మరో అంశంగా చెప్పుకోవచ్చు.