ఆమె కోట్లకు అధిపతి కాదు..! సొంతంగా కార్లు, బంగళాలు లేవు..! కానీ ఆమె ప్రైవేట్ జెట్లలో, ఓడల్లో ప్రయాణిస్తున్నది. ప్రపంచ దేశాలు తిరుగుతున్నది..! ఖరీదైన కార్లు నడుపుతున్నది..! కోటీశ్వరురాలు కాకపోతే ఆమెకు ఇవన్నీ ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? కోటీశ్వరురాలు కానిదే ప్రైవేట్ జెట్లలో, ఓడల్లో ఎలా ప్రయాణించగలదు.. ఖరీదైన కార్లు ఎలా నడుపగలదు.. అని ఆలోచిస్తున్నారా..? ఇది నిజం..! ఇంతకూ ఆ మహిళ ఎవరు..? ఆమెకు ఇవన్నీ ఎలా సాధ్యం..? అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పేరు గ్లోరియా రిచర్డ్స్. ఆమె అమెరికాకు చెందిన నల్లజాతి మహిళ. వయస్సు 34 ఏళ్లు. అయితే అందరిలా ఆమె బతకడం కోసం ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుని సరిపెట్టుకోలేదు. తనకు స్వతహాగా అబ్బిన ఆడటం, పాడటం, పిల్లలను ఆడించడం, వాళ్లతో ఓపిగ్గా మాట్లాడటం, కార్లు డ్రైవ్ చేయడం లాంటి లక్షణాలనే ఆమె వృత్తిగా మలుచుకుంది. పిల్లలకు సమయం కేటాయించలేని కోటీశ్వరుల ఇళ్లలో ఆయాగా పనిచేయడం మొదలుపెట్టింది.
కోటీశ్వరుల పిల్లలను ఆడించడం, పాడించడం, కథలు చెప్పడం, పార్కులు, హోటళ్లు, ‘జూ’లు, మ్యూజియాలు తదితర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ఆమె దినచర్య. ఆమె ఏ ఇంట్లో ఆయాగా పనిచేస్తే ఆ ఇంటి కారు ఆ రోజుకు ఆమెదే. ఒక్కో ఇంట్లో ఒక్కో రకం కారు. వాటిలో పిల్లలను బయటికి తీసుకెళ్లి తిప్పుకురావడం ఆమె డ్యూటీ. ఇలా దేశవిదేశాల్లో ఆమె క్లయింట్స్ ఉన్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రైవేట్ జెట్లు, ఓడల్లో ఆమె ప్రయాణిస్తున్నది. ఆమె రవాణా ఖర్చులను కూడా ఆమెను ఆయాగా నియమించుకునే వాళ్లే భరిస్తారు.
కొందరు ఒక్క రోజు కోసం, మరి కొందరు వారం కోసం, ఇంకొందరు 15 రోజులు, నెల కోసం ఆమెను ఆయాగా నియమించుకుంటారు. ఎన్ని రోజులకు నియమించుకుంటే అన్ని రోజులకు రోజుకు 2000 డాలర్ల చొప్పున ఆమెకు పైకం చెల్లిస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆమె ఒకరోజు సంపాదన రూ.1.65 లక్షలు అన్నమాట. అందుకే తాను సంవత్సరంలో రెండు నెలలు పని చేశానంటే మిగతా 10 నెలలు హ్యాప్పీగా బతికేయవచ్చని చెబుతున్నది గ్లోరియా. అయితే ఆయాగా అని చేయడం అంత సులువేమీ కాదని, కొంతమంది పిల్లలు చాలా ఏడిపిస్తారని ఆమె తెలిపింది. ఇలాంటి చిన్నచిన్న సమస్యలున్నా మొత్తానికి చూసుకుంటే మాత్రం ఈ పని తనకు తెగ నచ్చిందని గ్లోరియా పేర్కొంది.