న్యూఢిల్లీ : అమెరికా ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న దాదాపు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను నిశితంగా సమీక్షిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సమీక్షలో ఎవరైనా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే, తక్షణమే వారి వీసాను రద్దు చేయడమే కాకుండా, వారిని అమెరికా నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ఈ ‘నిరంతర పరిశీలన’లో భాగంగా వీసాదారుల ప్రవర్తనపై అధికారులు నిఘా పెడతారు. ముఖ్యంగా వీసా జారీ అయిన తర్వాత వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చాయా? వారు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారా? అని తనిఖీ చేస్తారు. వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం, నేర కార్యకలాపాలకు పాల్పడటం, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చినట్టు తేలితే వీసాలు ఏ క్షణమైనా రద్దు అవుతాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కొత్త నిబంధన కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారితో పాటు, ఇప్పటికే వీసా కలిగి ఉన్న అందరికీ వర్తిస్తుంది.
విదేశాలకు చెందిన లారీ డ్రైవర్లకు వీసాల జారీని అమెరికా గురువారం నుంచి హఠాత్తుగా నిలిపేసింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయ డ్రైవర్ నడిపిన లారీ ప్రమాదానికి గురికావడంతో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో కమర్షియల్ ట్రక్ డ్రైవర్స్‌కు వర్కర్ వీసాల జారీని తక్షణమే నిలిపేస్తున్నామని ఎక్స్‌లో చెప్పారు. భారీ ట్రాక్టర్-ట్రైలర్ ట్రక్స్‌ను విదేశీ డ్రైవర్లు నడపటం వల్ల అమెరికన్ ట్రక్కర్ల జీవనోపాధి దెబ్బతింటున్నదని తెలిపారు.