టెహ్రాన్, జూన్ 22: అమెరికా బాంబు దాడులను ఊహించిన ఇరాన్, కీలక అణు కేంద్రం నుంచి సామగ్రినంతటినీ ముందుగానే సర్దేసిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనను బలపరుస్తూ ఉపగ్రహ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. అమెరికా దాడి చేసే సమయానికంటే ముందే ఫోర్డో అణు కేంద్రం నుంచి కీలక పరికరాలు, యురేనియాన్ని ఇరాన్ మరో చోటకు తరలించినట్టు అనుమానిస్తున్నారు.
జూన్ 19-20 రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో ఇక్కడ భారీ సంఖ్యలో ట్రక్కులు ఇతర వాహనాలు బారులు తీరి కనిపించాయి. జూన్ 19న 16 కార్గో ట్రక్కులు అణు కేంద్రం సొరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇక 20వ తేదీన అక్కడికి కిలోమీటర్ దూరంలో చాలా ట్రక్కులు ఆగి వున్నట్టు గుర్తించారు. ప్రధాన కేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు కూడా కనిపించాయి.
దాడుల్ని ముందుగా అంచనా వేసిందనే విధంగా ఇరాన్ చర్యలు ఉన్నాయి. టెహ్రాన్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోర్డో అణు కేంద్రం, వైమానిక బాంబు దాడులను తట్టుకునేలా ఒక పర్వతానికి అడుగుభాగాన నిర్మించారు.