వాషింగ్టన్: డెన్మార్క్‌కు మద్దతుగా పలు యూరోపియన్ దేశాల దళాలు గ్రీన్లాండ్కు చేరుకోవడం గురువారం కూడా కొనసాగింది. డెన్మార్క్, గ్రీన్లాండ్, అమెరికాల ప్రతినిధుల మధ్య చర్చల్లో పురోగతి కనిపించడం లేదు. ఈ ఆర్కిటిక్ ద్వీపం భవిష్యత్తుపై అమెరికా, యూరోపియన్ మిత్ర దేశాల మధ్య మౌలిక అంగీకారం లేదనే విషయాన్ని ఈ చర్చలు తేటతెల్లం చేస్తున్నాయి. డైరెక్ట్ నాటో కమాండ్‌కు వెలుపల ఈ విధంగా కార్యకలాపాలు జరగడం ఇదే తొలిసారి.
ఫ్రాన్స్ 15 మౌంటెయిన్ స్పెషలిస్ట్స్ టీమ్‌ను, జర్మనీ 13 మందితో కూడిన రికనయిస్సెన్స్ టీమ్‌ను పంపించాయి. యూకే ఒక అధికారిని, నార్వే ఇద్దర్ని, స్వీడన్ ముగ్గుర్ని పంపించాయి. గ్రీన్లాండ్లో యూరోపియన్ దేశాల మధ్య సైనిక సహకారాన్ని పటిష్టం చేసుకునే లక్ష్యంతో ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యురెన్స్ పేరుతో ఈ దళాలు ఇక్కడికి చేరుకున్నాయి.