వాషింగ్టన్, జూలై 26: తమ దేశానికి రావాలనుకునే వారికి వీసా, పౌరసత్వ విధానాలను మరింత కఠినతరం చేసే దిశగా అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నారు. వీటికోసం నిర్వహించే పరీక్షలు ఇకపై సంక్లిష్టంగా మార్చనున్నారు. అమెరికా పౌరసత్వం పొందేందుకు నిర్వహించే పరీక్షలో మార్పులు చేసే ప్రణాళికను ట్రంప్ యంత్రాంగం పరిశీలిస్తున్నదని యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసఫ్ ఎడ్లో వెల్లడించారు.
కాగా, నిపుణులైన కార్మికుల కోసం ప్రస్తుతమున్న హెచ్-1బీ వీసా లాటరీ పద్ధతిని తొలగించి వీసా వ్యవస్థను ట్రంప్ యంత్రాంగం మార్పు చేస్తుందని తొలుత వార్తలొచ్చాయి. అయితే దీనిపై జోసఫ్ గురువారం న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ యూఎస్ పౌరులకు అవసరమైన సహజీకరణ(నేచురలైజేషన్) పరీక్షను ట్రంప్ యంత్రాంగం సంక్లిష్టంగా మా ర్చాలనుకుంటున్నదని చెప్పారు. ప్రస్తుతానికి వలసదారులు 100 పౌరశాస్త్ర ప్రశ్నలను అధ్యయనం చేయాలి. ఆ పరీక్షలో ఆ భాగంలో 10 ప్రశ్నలలో ఆరింటికి సరైన సమాధానం ఇవ్వాలి.
ఇది చాలా సులభమైన పద్ధతి అని ట్రంప్ భావిస్తున్నారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు ఏజెన్సీ ప్రశ్నల సంఖ్యను పెంచింది. దరఖాస్తుదారులు 20 ప్రశ్నలలో 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆ తరహా విధానాన్నే తిరిగి తేవాలని ఏజెన్సీ యోచిస్తున్నదని తెలిపారు. అమెరికా పౌరుడు కావాలనుకునే వారికి నిర్వహించే పరీక్ష చాలా సులభంగా ఉందని, దానిని తప్పక మార్చాలని జోసఫ్ అన్నారు. తాము ప్రతిపాదించే మార్పులను ఫెడరల్ నిబంధనల మేరకు ఆమోదించాల్సి ఉంటుందని తెలిపారు.