న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని యూనివర్సిటీలు(US Universities) విదేశీ విద్యార్థులు, సిబ్బందికి వార్నింగ్ ఇచ్చాయి. 47వ దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న ట్రంప్.. మొదటి రోజే అనేక ఆదేశాలు ఇవ్వనున్నారు. ఆర్థికం, ఇమ్మిగ్రేషన్ లాంటి అంశాలపై ఆయన సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులు, స్టాఫ్కు అమెరికా యూనివర్సిటీలు వార్నింగ్ జారీ చేశాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కంటే ముందే అమెరికా చేరుకోవాలని పలు యూనివర్సిటీలు ఆదేశించాయి.
అమెరికా విద్యా, సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ విద్యా సంస్థ డేటా ప్రకారం.. భారత్, చైనాకు చెందిన విద్యార్థులే అమెరికాలో 54 శాతం మంది ఉంటారని అంచనా వేశాయి అయితే 2009 తర్వాత తొలి సారి అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-2024 సీజన్లో అమెరికాకు సుమారు 3,31,602 మంది భారతీయ విద్యార్థులు వెళ్లినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 23 శాతం పెరిగింది. చైనా ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నది. ఆ దేశానికి చెందిన 277398 మంది విద్యార్థులు అమెరికా వెళ్లారు. సుమారు 4 శాతం విద్యార్థుల వలస తగ్గింది.
ప్రభుత్వాలు మారినప్పుడు, విధానాలు, ఆంక్షలు, చట్టాలు మారుతాయని, దాని వల్ల ఉన్నత విద్య, ఇమ్మిగ్రేషన్పై ప్రభావం పడుతుందని మసాచుసెట్స్ వర్సిటీ డైరెక్టర్ డేవిడ్ ఎల్విల్ తెలిపారు. శీతాకాలం బ్రేక్ తీసుకునే విద్యార్థులు తమ ట్రావల్ ప్లాన్ను సరిచూసుకోవాలని ఎంఐటీ డీన్ ఓ ప్రకటనలో కోరారు. ట్రంప్ ఆదేశాలతో ట్రావెల్, వీసా ప్రాసెసింగ్లో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు.