US Troops : ఇరాన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు, కొన్ని దీవుల్ని ఆక్రమించేందుకు అమెరికా తన సైనిక బలగాల్ని పశ్చిమాసియాకు తరలించిన సంగతి తెలిసిందే. భూతల పోరుకోసం ఏకంగా 3,500 ట్రూపుల్ని తరలించినట్లు అమెరికా వెల్లడించింది. అధునాతన యుద్ధనౌక యూఎస్ఎస్ ట్రిపోలి ద్వారా సైనికులు గల్ఫ్ తీరానికి చేరుకున్నారు. అయితే, అమెరికన్ సైనికుల రాకపై ఇరాన్ ఘాటుగా స్పందించింది.
తమ దీవుల్ని, నేలను ఆక్రమించాలని చూస్తే అమెరికన్ సైనికులంతా అక్కడి పర్షియన్ గల్ఫ్ షార్కులకు ఆహారంగా మారడం ఖాయమని హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇరాన్ ఆర్మీ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ సైనిక ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఎబ్రహిమ్ జోల్ఫాకరి మాట్లాడిన వీడియోను ఆర్మీ పోస్టు చేసింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై కూడా విమర్శలు చేశారు. ట్రంప్‌నకు ఎప్స్టీన్తో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయనపై ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఒత్తిడి తెస్తోందని, దీంతో ట్రంప్ దాడులు చేయిస్తున్నాడని ఎబ్రహిమ్ అన్నాడు. ఇజ్రాయెల్‌కు ట్రంప్ తన దేశాన్ని తాకట్టుపెట్టాడని ఆరోపించాడు. మొసౌద్ అనే తీవ్రవాద సంస్థ ఒత్తిడికి ట్రంప్ తలొగ్గాడని ఆరోపించాడు. తమపై దాడి చేయాలని చూస్తే అమెరికన్ సైనికులు షార్క్‌లకు ఆహారంగా మారడం ఖాయమని హెచ్చరించారు. ఏదైనా భూతల దాడి జరిగితే అమెరికన్ దళాల అంతానికి కౌంట్‌డౌన్ ప్రారంభిస్తామన్నారు.
‘Trump a PAWN of Israeli PM, under pressure from Mossad due to his background in EPSTEIN case’ — Iran Armed Forces Spox
If Trump attempts ground op, ‘US soldiers will become good food for SHARKS of Persian Gulf’ pic.twitter.com/dmA22R5Ali
— RT (@RT_com) March 29, 2026
ఇక, ఇప్పటికే అమెరికన్ దళాలు నౌకలో పశ్చిమాసియా చేరుకున్నాయి. మొత్తం 3,500 ట్రూపుల్లో 2,500 మెరైన్లు ఉన్నారు. గడిచిన 20 ఏళ్లలో ఈ ప్రాంతంలో అమెరికా ఈ స్థాయిలో దళాలను మోహరించడం ఇదే మొదటిసారి. ఇప్పుడు వైమానిక దాడులకే పరిమితమైన యుద్ధం.. అమెరికన్ దళాలు బరిలోకి దిగితే భూతల యుద్ధంగా మారుతుంది. ఇదే జరిగితే యుద్ధం మరింత ముదురుతుంది. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూనే అమెరికా, ఇరాన్‌లు మరోవైపు యుద్ధ సన్నాహాలు చేయడం విశేషం.