బీజింగ్: అమెరికా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ .. చైనాలో ఉన్న ఓ స్టోర్‌ను మూసివేయనున్నది. డ్రాగన్ దేశంలో యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో అక్కడ ఉన్న ఓ షాపును మూసివేయనున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. 15 ఏళ్ల క్రితం చైనాలోకి ఎంట్రీ ఇచ్చింది యాపిల్ సంస్థ. స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో.. యాపిల్ సంస్థ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ తగ్గింది. మరో వైపు చైనాతో వాణిజ్యం విషయంలో టారిఫ్ వార్ కొనసాగుతున్న దృష్ట్యా కూడా సేల్స్ పడిపోయాయి.
జాంగ్షాన్ జిల్లాలో ఉన్న దాలియన్ సిటీలోని పార్క్‌ల్యాండ్ మాల్ స్టోర్‌ను మూసివేయనున్నట్లు సోమవారం యాపిల్ సంస్థ తెలిపింది. ఆగస్టు 9వ తేదీన ఆ షాపును మూసివేయనున్నట్లు చెప్పారు. తమ స్టేట్మెంట్ను చైనీస్ మీడియా సంస్థలు ప్రచురించాయి. చైనాలో యాపిల్ సంస్థకు 57 దుకాణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిటేల్ నెట్‌వర్క్‌లో అది పది శాతం మాత్రమే. కానీ వరుసగా ఆరవ త్రైమాసికంలోనూ యాపిల్ కంపెనీ ఉత్పత్తుల సేల్స్ పడిపోయాయి. వార్షిక ఆదాయం 66 బిలియన్ల డాలర్లకు తగ్గింది.
చైనాకు చెందిన హువాయి, జియోమి, వీవో బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పుంజుకున్నాయి. టెకీ పరిశోధన సంస్థ కెనాలిస్ ప్రకారం.. చైనాలోని అమ్మకాల్లో యాపిల్ సంస్థ అయిదో స్థానంలో ఉంది.