US Shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తూటా పేలింది. ఫ్లోరిడాలోని ఓ జనరల్ స్టోర్‌లో శనివారం ఓ వ్యక్తి కాల్పులు జరుపగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను జాతి వివక్షగా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తి సైతం చనిపోయాడని పోలీసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి నల్లజాతీయులను ద్వేషిస్తున్నాడని, ఈ ఘటనను జాతి విద్వేషపూరిత దాడిగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకున్నాడు. దాడికి పాల్పడిన వ్యక్తి ద్వేషపూరి భావజాలానికి ప్రభావితమయ్యాడని.. ఈ దాడికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిన ఆధారాలు సూచిస్తున్నాయన్నారు.
మరో వైపు బోస్టన్‌లో శనివారం ఉదయం ప్రసిద్ధ బోస్టన్ కవాతు జరుగుతున్న సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. సమాచారం ప్రకారం.. కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. కాల్పుల నేపథ్యంలో కవాతును నిలిపివేయాల్సి వచ్చింది. బాధితులను పోలీసులు ఆసుప్రతికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఘటన అనంతరం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, పరేడ్‌లో కాల్పులు జరుగలేదని.. సమీప ప్రాంతంలో జరిగాయని పోలీస్ కమిషనర్ మైఖేల్ కాక్స్ స్పష్టం చేశారు. కాల్పులతో పరేడ్‌ను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.