టెహ్రాన్, ఏప్రిల్ 5: అమెరికాకు ఇరాన్ మరో షాక్ ఇచ్చింది. యూఎస్ ఎఫ్-15ఈ ఫైటర్ జెట్ పైలట్‌ను రక్షించే ఆపరేషన్ సందర్భంగా అమెరికాకు చెందిన రెండు సీ-130 విమానాల్ని కూల్చినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఈ సందర్భంగా ఐదుగురు మరణించినట్టు పేర్కొన్నది. మరో ఇజ్రాయెల్ డ్రోన్‌ని కూడా కూల్చినట్టు తెలిపింది.
దక్షిణ ఇరాన్లో యూఎస్ దళాలు చేపట్టిన అత్యంత రిస్క్ ఆపరేషన్‌లో ఇది అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బగా వ్యాఖ్యానించింది. ఒక పొలంలో కూలిన విమానం నుంచి దట్టమైన పొగ వెలువడుతున్న చిత్రాన్ని ఐఆర్జీసీ తన టెలిగ్రామ్ చానల్లో పోస్ట్ చేస్తూ ‘భారీ ఓటమిని తప్పించుకోవడానికి ట్రంప్ చేస్తున్న నిస్సహాయ ప్రయత్నం’ అంటూ వ్యాఖ్యానించింది.
అయితే తమ విమానాలను తామే పేల్చివేసినట్టు అమెరికా ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను కొందరు యూఎస్ అధికారులు వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు. రెండు ఎంసీ-130జే రవాణా విమానాలు పైలట్‌ను రక్షించే ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అయితే ఈ మిషన్ సమయంలో ఆ రెండు విమానాలు చిక్కుకుపోయాయి. అయితే అది ఎలా జరిగిందో వారు వివరంగా చెప్పలేదు.
దాంతో ఆ విమానాలను అలాగే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే ఖరీదైన విమానాలు ఇరాన్‌కు చిక్కడంతో పాటు తమ విమాన సాంకేతికత, దానిలో వాడుతున్న యుద్ధ పరికరాలు, ఇతర వివరాలు శత్రు దేశం చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తగా విమానాలను ధ్వంసం చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.