వాషింగ్టన్: అమెరికాలో తాజాగా పిల్లల్లో కరోనా వ్యాప్తి కలకలం రేపుతున్నది. గత వారం రోజుల్లో 37 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాలతో పోల్చితే పిల్లల కరోనా కేసులు 43 శాతం మేర పెరిగాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ), చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ (సీహెచ్ఏ) ఈ మేరకు పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాలో 12.9 కోట్ల మంది పిల్లలు కరోనా బారిన పడినట్లు తెలిపాయి. అయితే గత నెల రోజుల్లో 1,24,000 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని ఒక నివేదికలో వెల్లడించాయి.
కాగా, అమెరికాలో గత ఏడాది సెప్టెంబర్ తొలి వారం నుంచి 79 లక్షల కరోనా కేసులు అదనంగా నమోదైనట్లు ఒక వార్తా సంస్థ తెలిపింది. ఇందులో పిల్లల కరోనా కేసులు 19 శాతం మేర ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు రెండు కొత్త వేరియట్ల వల్ల వ్యాపిస్తున్న కరోనాపై అప్రమత్తం కావాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) హెచ్చరించింది. పిల్లల ఆరోగ్యంపై వీటి తీవ్రత, దీర్ఘకాల ప్రభావం గురించి తెలుసుకునేందుకు వయసుల వారీగా కరోనా కేసుల నమోదు డేటాను అత్యవసరంగా సేకరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.