Trump Tariffs | వాషింగ్టన్: భారత్‌పై ఇప్పటికే సుంకాలను విచ్చలవిడిగా పెంచిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌పై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారులను ట్రంప్ కోరినట్లు సమాచారం. భారత్‌తో పాటు చైనాపై కూడా ఇదే తరహాలో సుంకాలు విధించాలని అడిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో డోనాల్డ్ ట్రంప్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్, చైనాపై 100 శాతం సుంకం విధించాలని సూచించినట్లు రాయిటర్స్ తెలిపింది. చమురు కొనుగోళ్లను ఆపేస్తామని వెల్లడించే వరకు ఆయా దేశాలపై కొత్త టారిఫ్‌లను కొనసాగించాలని సూచించారని పేర్కొంది. భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అందుకే రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావాలంటే ఈ చర్యలు అవసరమని పేర్కొన్నారు.
భారత్‌పై ఇప్పటికే అమెరికా సుంకాల మోత మోగించింది. ఈ ఏడాది జూలైలో భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించిన ట్రంప్.. ఆ తర్వాత దాన్ని 50 శాతానికి పెంచారు. ఇప్పుడు యూరోపియన్ దేశాలు సైతం 100 శాతం టారిఫ్ వేయాలని సూచించడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, భారత్‌తో వాణిజ్య సంబంధాలను విస్తరింపజేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని, త్వరలోనే ప్రధాని మోదీతో దీనిపై మాట్లాడతానని తెలిపారు.