Donald Trump | వెనుజువెలా భూభాగంపై తొలిసారిగా అగ్రరాజ్యం అమెరికా దాడికి పాల్పడింది. పడవల్లో డ్రగ్స్ లోడింగ్‌కు వాడే డాక్‌పై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ విషయాన్ని ఫ్లోరిడాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధ్రువీకరించారు. ‘ ముందుగా అన్ని బోట్లను ధ్వంసం చేశాం. ఇప్పుడు వాటిని తరలించే ప్రాంతాన్ని కొట్టాం. ఆ డాక్ ఇక లేదు’ అని తెలిపారు. గత వారం ఓ రేడియో ఇంటర్వ్యూలో కూడా ఈ దాడి గురించి ట్రంప్ ప్రస్తావించారు. ఓ పెద్ద సౌకర్య కేంద్రంపై అమెరికా ఆపరేషన్ జరిగిందని తెలిపారు. తాజాగా ఇప్పుడు రెండోసారి ఈ దాడి గురించి వెల్లడించారు.
అయితే ఈ దాడి జరిగిన ప్రాంతం ఎక్కడ ఉంది? దాడి ఎప్పుడు జరిగిందనే విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు. ఈ దాడిలో కేవలం అమెరికా సైన్యమే పాల్గొందా? సీఐఏ ప్రమేయం ఉందా అన్న వివరాలు కూడా బయటపెట్టలేదు. ఈ దాడి వెనుజువెలా భూభాగంపైనే జరిగిందా? లేదా అన్నది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఈ దాడిపై వైట్‌హౌస్ కూడా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. గతంలో డ్రగ్స్ తరలించే బోట్లపై దాడుల సమయంలో చిత్రాలు, వీడియోలను పెంటగాన్ విడుదల చేసింది. కానీ ఈ డాక్ ధ్వంసానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫొటోలు విడుదల చేయలేదు. మరోవైపు వెనుజువెలా ప్రభుత్వం కూడా అధికారికంగా స్పందించలేదు.
డ్రగ్స్ స్మగ్లింగ్‌పై అమెరికా గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఉక్కుపాదం మోపుతోంది. పసిఫిక్, కరేబీయన్ సముద్రాల్లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నాయని ఆరోపిస్తూ 20కి పైగా బోట్లపై అమెరికా దాడులు చేసింది. వీటిలో చాలావరకు వెనుజువెలాకు చెందిన బోట్లే ఉన్నాయని అమెరికా చెబుతుంది. ఈ మొత్తం దాడుల్లో 100 మంది వరకు చనిపోయినట్లు సమాచారం.