న్యూయార్క్: అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వాన్ని(Birthright Citizenship ) ఇచ్చే విషయం తెలిసిందే. పేరెంట్స్‌కు పౌరసత్వం లేకున్నా.. అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇస్తున్నారు. 150 ఏళ్ల నుంచి అమలులో ఉన్న ఆ రాజ్యాంగ హక్కును ఇప్పుడు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ జన్మహక్కు హాస్యాస్పదమైందని, జనవరి 20వ తేదీన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ హక్కును ట్రంప్ కాలరాస్తారని భావిస్తున్నారు.
బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను మార్చేస్తామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని, కానీ ఏదో ఓ సందర్భంలో అంతం కావాలన్నారు. తొలి దశ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ పౌరసత్వ అంశాన్ని ప్రస్తావించారు. 14వ సవరణ ద్వారా పౌరసత్వ జన్మహక్కును రాజ్యాంగంలో పొందుపరిచారు. అమెరికా చట్టాల కింద ఆ హక్కును పటిష్టంగా అమలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేయడం అంటే, చాలా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పౌరసత్వ జన్మహక్కు వల్ల.. గర్భంతో ఉన్న విదేశీ మహిళలు.. అమెరికాలోకి ఎంటర్ అయి ఇక్కడ పిల్లలను ప్రసవించిన తర్వాత మళ్లీ వెళ్లిపోతున్నారని, అందుకే ఆ విధానాన్ని మార్చాలని ట్రంప్‌తో పాటు ఇతర పార్టీలు ఆలోచిస్తున్నాయి.