Donald Trump | వాషింగ్టన్, జనవరి 31: జన్మతః పౌరసత్వాన్ని కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ ఆమోదించింది బానిసల పిల్లల కోసమే తప్ప ప్రపంచ ప్రజలంతా అమెరికాపై ఎగబడి తిష్ఠవేసేందుకు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జన్మతః పౌరసత్వాన్ని కల్పించే రాజ్యాంగ సవరణను ఆమోదించిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అది బానిసల పిల్లల కోసమేనని అర్థమవుతుందని అన్నారు. ప్రపంచంలోని ప్రజలంతా అమెరికాకు తరలివచ్చి ఇక్కడే తిష్ఠ వేసుకోవడానికి కాదని ఆయన చెప్పారు. ఎవరుపడితే వారు అమెరికా వచ్చేస్తున్నారని, అర్హతలు లేని వారు, అర్హతలు లేని పిల్లల కోసం ఇది ఉద్దేశించింది కాదని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ట్రంప్ సంతకం చేసిన అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో జన్మతః పౌరసత్వం రద్దు కూడా ఉంది. అయితే సియాటెల్ రాష్ట్రంలోని ఫెడరల్ కోర్టు ఈ ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసింది. కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని ప్రకటించిన ట్రంప్ అక్కడ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. బానిసలకు జన్మతః పౌరసత్వం కల్పించడానికి తాను పూర్తిగా అనుకూలమని స్పష్టం చేసిన ట్రంప్, ఇది చాలా ఉదాత్తమైన విషయమని పేర్కొన్నారు.
జన్మతః పౌరసత్వం కల్పించడం వెనుక ఉద్దేశం ప్రపంచమంతా అమెరికాను ఆక్రమించుకోమని కాదని ఆయన స్పష్టం చేశారు. అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలపై వచ్చిన నాన్ ఇమ్మిగ్రంట్ల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును రిపబ్లికన్ సెనేటర్లు అమెరికా సెనేట్‌లో ఇటీవల ప్రవేశపెట్టారు. అమెరికన్ పౌరుడు లేదా అమెరికా జాతీయుడు, చట్టబద్ధంగా అమెరికా శాశ్వత నివాసి, అమెరికా సాయుధ దళాలలో పనిచేస్తున్న ఇమ్మిగ్రెంట్కు జన్మించిన పిల్లలకు మాత్రమే జన్మతః పౌరసత్వాన్ని కల్పించాలని కోరుతూ జన్మహక్కు పౌరసత్వ చట్టం, 2025ని సెనేటర్లు లిండ్సే గ్రాహం, టెడ్ క్రూజ్, కేటీ బ్రిట్ ఇటీవల సెనేట్‌లో ప్రవేశపెట్టారు.
ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా అమెరికన్ డాలర్ స్థానంలో వేరే కరెన్సీ తెచ్చేందుకు ప్రయత్నిస్తే 100 శాతం సుంకాన్ని విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం బ్రిక్స్ సభ్య దేశాలను మరోసారి హెచ్చరించారు. అమెరికన్ డాలర్ స్థానంలో కొత్త బ్రిక్స్ కరెన్సీని గాని లేదా వేరే కరెన్సీని బలపరచడం కాని చేయబోమని బ్రిక్స్ సభ్య దేశాల నుంచి తమకు హామీ కావాలని, లేని పక్షంలో ఆ దేశాలు 100 శాతం సుంకాన్ని ఎదుర్కోవలసి వస్తుందని సోషల్ మీడియా వేదిక ట్రూత్‌సోషల్ పోస్టులో ట్రంప్ హెచ్చరించారు.
అంతర్జాతీయ వాణిజ్యంలో కాని మరెక్కడైనా కాని అమెరికన్ డాలర్‌ను భర్తీ చేసే అవకాశం బ్రిక్స్‌కు లేదని, ఒకవేళ ఏ దేశమైనా ఆ ప్రయత్నం చేస్తే సుంకాలకు హలో చెప్పి అమెరికాకు గుడ్‌బై చెప్పాల్సి వస్తుందని స్పష్టంచేశారు. బ్రిక్స్ సభ్య దేశాలలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజి ప్టు, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఈ గ్రూపునకు ఉమ్మడి కరెన్సీ ఏదీ లేనప్పటికీ ఉక్రెయిన్‌తో యుద్ధం అనంతరం అనేక పశ్చి మ దేశాల నుంచి రష్యా ఆంక్షలను ఎదుర్కోవడంతో ఈ అంశంపై చర్చలు జోరందుకున్నాయి.