న్యూఢిల్లీ, జూన్ 16: లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అక్కడ హెజ్బొల్లాను ఎదుర్కోవడంలో సిరియా అంతకన్నా మెరుగ్గా వ్యవహరిస్తుందని ట్రంప్ ఇజ్రాయెల్‌కు చురకలు అంటించారు. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ లేదు. నెతన్యాహు బాధ్యతగా వ్యవహరించాలి’ అని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ఖతార్ ఎమిర్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ మద్దతు గల ఉగ్రవాద గ్రూపు హెజ్బొల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేపట్టిన సైనిక చర్య ఇరాన్‌తో శాంతి చర్చలకు విఘాతం కలిగించిందని అన్నారు.
ఇతరులందరినీ చంపకుండా ఇజ్రాయెల్ ఆ పని చేయలేదు కాబట్టి సిరియానే ఆ పని చేయాలి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, ఇజ్రాయెల్‌కు సిరియా చిరకాల శత్రువు అన్న విషయం ట్రంప్‌నకు బాగా తెలుసు. అమెరికా, ఇరాన్ ప్రాథమిక శాంతి ఒప్పందానికి అంగీకరించిన ఒకరోజు తర్వాత వచ్చిన ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌ను విమర్శించే ఉద్దేశంతోనే చేసినట్లు కనిపిస్తున్నది. ఈ ఒప్పందంలో లెబనాన్‌లో సైనిక కార్యకలాపాలు ముగించడం కూడా ఉన్నట్లు ఇరాన్, పాకిస్థాన్ వాదిస్తుండగా ఇజ్రాయెల్‌కు ఇది తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నది.
బీరుట్‌పై చేసిన దాడి తనకు నచ్చలేదని ఆదివారం ఇజ్రాయెల్‌కు చెప్పానని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ చాలాకాలంగా హెజ్బొల్లాతో పోరాడుతున్నది. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరినైనా వెతికేటప్పుడు ప్రతిసారీ ఒక అపార్ట్మెంట్ భవనాన్ని కూల్చివేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ భవనాల్లో చాలా మంది పౌరులు ఉంటారు. వారందరూ హెజ్బొల్లా సభ్యులు కారు. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను అని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.