Donald Trump | అమెరికా ఫస్ట్ తన నినాదం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తన ప్రమాణ స్వీకారానికి దేశదేశాల నుంచి వచ్చిన అతిథులకు స్వాగతం తెలిపారు. అమెరికాలో ఈ రోజు నుంచి స్వర్ణ యుగం ప్రారంభం అవుతుందన్నారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ట్రంప్.. కార్యక్రమానికి హాజరైన ఆహుతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా పాలన సాగిస్తామన్నారు.
ఇక నుంచి అమెరికా ప్రపంచ దేశాల మరింత గౌరవం పొందుతుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రస్తుతం అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నదన్నారు. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అమెరికా నిలబడిందన్నారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం అని చెప్పారు. అమెరికాకు ప్రపంచ దేశాల సహకారం కావాలన్నారు.
అమెరికాలోకి అక్రమ వలసలు అరికడతాం అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తామన్నారు. క్రిమినల్ గ్యాంగ్‌ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అని తెలిపారు. అమెరికాలో తీవ్రవాద చర్యలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. దేశంలో నేర ఘటనలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.శాంతిభద్రతల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని అన్నారు. రెస్టారెంట్లలో కాల్పులు జరగకుండా చూస్తామన్నారు. తాను దేవుడి దయ వల్ల తుపాకీ కాల్పుల నుంచి తృటిలో ప్రాణాలతో బయట పడ్డా అని అన్నారు. అమెరికాకు పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ విద్యా రంగంలో సంస్కరణలు తేవాలని, త్వరలో తీసుకు వస్తాం అనిహామీ ఇచ్చారు.
పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకుంటాం అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోనే అమెరికాను ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా నిలుపుతామని ప్రకటించారు. ప్రపంచ దేశాలకు అమెరికా ఎనర్జీ ఎగుమతి కావాలన్నారు.