వాషింగ్టన్, జూలై 2 : అమెరికాలోని విదేశీ విద్యార్థులకు మరో ఎదురుదెబ్బ తగలనున్నది. అంతర్జాతీయ విద్యార్థులు, సందర్శకులు అమెరికాలో ఎంతకాలం ఉండాలో నిర్దేశించే వివాదాస్పద బిల్లును డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అక్రమ వలసదారులను తొలగించడం, అమెరికాలోని యూనివర్సిటీ క్యాంపస్లలో యూదులకు వ్యతిరేక ప్రచారాన్ని నిర్మూలించడంపై కఠిన వైఖరిని ట్రంప్ ప్రభుత్వం అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా మొదటి దఫా అధికారంలో ఉన్నపుడు 2020లో ట్రంప్ ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న స్టూడెంట్ వీసా విధానం స్థానంలో నిర్దిష్టమైన కాలవ్యవధిని నిర్దేశించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన ప్రతిపాదించారు.
ఇది ఆమోదం పొందిన పక్షంలో ప్రతి విదేశీ వీసాకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రస్తుతం ఎఫ్-1 వీసాలు కలిగి ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, జే-ఎల్ వీసాలపై వచ్చే సందర్శకులకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ లభిస్తుంది. దీంతో విదేశీ విద్యార్థులు, సందర్శకులు, విదేశీ మీడియా ప్రతినిధులు ఫుల్-టైమ్ ఎన్రోల్మెంట్ ఉన్నంతవరకు అమెరికాలోనే ఉండవచ్చు. అయితే కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే వీరంతా ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే పరిమితమై అమెరికాలో ఉండవలసి ఉంటుంది. గడువు తీరిన తర్వాత వారంతా ఎప్పటికప్పుడు కొనసాగింపు కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కాగా, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే భారతీయుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 70 శాతం తగ్గింది.