న్యూయార్క్: ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికా భారీ స్థాయిలో తన ఆయుధాలను వినియోగించింది. రకరకాల క్షిపణుల(US Missiles)ను అధిక సంఖ్యలో వాడింది. దీంతో ఆ దేశ క్షిపణి బాండాగారం తగ్గిపోయింది. అయితే యుద్ధం నాటి పరిస్థితులకు మళ్లీ చేరుకోవాలంటే, ఆ దేశానికి సుమారు నాలుగేళ్లు పట్టే అవకాశాలు ఉన్నట్లు కొత్త విశ్లేషణ ద్వారా తెలుస్తోంది. ఆయుధ వ్యవస్థలన్నింటినీ వాడడం వల్ల మళ్లీ వాటి పునరుద్దరణకు చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు ఓ రిపోర్టులో తెలిపారు. ఇన్వెంటరీ క్షీణించిందని, దీని వల్ల వెస్ట్రన్ పసిపిక్‌లో తీవ్ర సమస్యలు ఉత్పన్నం అయ్యే ఛాన్సు ఉన్నట్లు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ పేర్కొన్నది.
ప్రస్తుతానికి ఇరాన్‌తో వార్‌కు కావాల్సినంత ఆయుధ నిల్వలు ఉన్నాయని, కానీ యుద్ధం కన్నా ముందునాటి పరిస్థితులకు చేరుకునే స్థాయిలో ఆయుధాలు లేవని ఆ రిపోర్టులో తెలిపారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సమయంలో సుమారు 12 వేల టార్గెట్లను ధ్వంసం చేసినట్లు సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. అయితే ఆ దాడుల సమయంలో అమెరికా దళాలు విస్తృత స్థాయిలో ఆయుధాలను వినియోగించాయి. తోమాహాక్ ల్యాండ్ అటాక్ మిస్సైల్స్, టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(థాడ్), పాట్రియాట్ ఇంటర్సెప్టార్స్ను విరివిగా ఉపయోగించినట్లు సీఎస్ఐఎస్ తన రిపోర్టులో పేర్కొన్నది.
యుద్ధ సమయంలో సుమారు 1000 తోమాహాక్ క్షిపణులను వాడినట్లు తెలుస్తోంది. అయితే క్షిపణి బాండాగారం ఖాళీ కావడం వల్ల.. ఆ క్షీణించిన సంపత్తి మళ్లీ పెరగాలంటే కనీసం నాలుగేళ్లు పడుతుందని సీఎస్ఐఎస్ అంచనా వేసింది. 2030 లేదా 2031 నాటి మళ్లీ పూర్తి స్థాయిలో అమెరికా దగ్గర క్షిపణి ఆయుధాలు ఉండే అవకాశం ఉన్నట్లు సీఎస్ఐఎస్ రిపోర్టులో పేర్కొన్నది. థాడ్, పాట్రియాట్ హెవీ సిస్టమ్స్ ఆయుధాలను సమీకరించుకునేందుకు కనీసం మూడేళ్లు పడుతుందని సీఎస్ఐఎస్ తన నివేదికలో చెప్పింది.