వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధిలో నౌకాదళానికి చెందిన మూడు నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని, వాటిని అడ్డుకున్నట్లు అమెరికా మిలిటరీ(US Milltary) పేర్కొన్నది. నౌకలపై దాడులకు పాల్పడిన ఇరానీ మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేసినట్లు అమెరికా దళాలు చెప్పాయి. ప్రస్తుతం నెల రోజుల నుంచి ఇరాన్, అమెరికా మధ్య సీజ్ఫైర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ ఘటన పట్ల సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. ఇరానీ దళాల నుంచి అకస్మాత్తుగా దాడులు జరగడం వల్ల ఆత్మరక్షణలో భాగంగా వాటిని అడ్డుకున్నట్లు సెంట్రల్ కమాండ్ చెప్పింది.
అయితే ఈ దాడుల్లో నౌకలకు ఎటువంటి నష్టం జరగలేదని, కానీ అమెరికా దళాలను రక్షించేందుకు నిత్యం అప్రమత్తతంతో ఉంటామని మిలిటరీ చెప్పింది. ఇరానీ కేంద్రాలపై దాడి చేసినా.. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతూనే ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా తెలిపారు. మా నౌకలపై దాడి చేయాలని చూశారు, కానీ మేం వాళ్లను టార్గెట్ చేశామని ట్రంప్ అన్నారు.
హోర్ముజ్‌లోని ఖేసమ్ ద్వీపంలో శత్రు దేశాన్ని ఎదుర్కొన్నట్లు ఇరాన్ ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ ఆధీనంలో ఉన్న అతిపెద్ద ద్వీపం అది. అక్కడ సుమారు లక్షన్నర మంది జీవిస్తున్నారు. ఆ దీవిలో వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ కూడా ఉన్నది. పశ్చిమ టెహ్రాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు వద్ద భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి.