అల్‌ఖైదా చీఫ్ హతం
- అల్ జవహరీని అంతమొందించిన అమెరికా సీఐఏ కాబుల్‌లోని ఇంటి బాల్కనీపై డ్రోన్‌తో లక్షిత దాడి
- జవహరీ మరణాన్ని ధ్రువీకరించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
- అమెరికన్లకు హాని చేస్తే ఇదే జరుగుతుందని హెచ్చరిక
- 9/11 ట్విన్ టవర్ల ఘటన కీలక సూత్రధారి జవహరీయే
వాషింగ్టన్, ఆగస్టు 2: అల్‌ఖైదా చీఫ్, ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరైన అయ్మన్ అల్-జవహరీ (71) హతమయ్యాడు. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో జవహరీ హతమైనట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్‌ను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) పూర్తిచేసినట్టు తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం శ్వేతసౌధం నుంచి ప్రత్యేక ప్రసంగం చేసిన ఆయన ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. 9/11 మృతుల కుటుంబాలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా బైడెన్ వ్యాఖ్యానించారు. తమ పౌరులకు హానితలబెట్టేవారు ఎక్కడ దాక్కున్నా పట్టుకొని మట్టుబెడతామని హెచ్చరించారు. ‘ఉగ్రవాది జవహరీ హతమయ్యాడు. 2,977 మందిని పొట్టనబెట్టుకున్న 9/11 ఘటనకు ప్రధాన సూత్రదారి ఇతనే. అమెరికాపై గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉగ్రదాడులకు మాస్టర్‌మైండ్ కూడా ఇతనే. ఇలాంటి కరుడుగట్టిన ఉగ్రవాది నేడు అంతమయ్యాడు. ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ భయం లేకుండా ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు’ అని అన్నారు. యుద్ధం అవసరంలేకుండానే, ప్రాణ నష్టం జరుగకుండానే ఉగ్రభూతాన్ని కూకటివేళ్లతో పెకిలించవచ్చని తాజా ఆపరేషన్ మరోసారి రుజువు చేసిందని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అన్నారు. కాబుల్‌లో జవహరీ ఇంటిపై అమెరికా జరిపిన ఆపరేషన్‌ను తాలిబాన్లు కూడా ధ్రువీకరించారు. అయితే తాజా ఆపరేషన్‌తో 2020లో తమతో చేసుకున్న దోహా ఒప్పందానికి అమెరికా తూట్లు పొడిచిందని మండిపడ్డారు.
ఆపరేషన్ జరిగిందిలా..
జవహరీని అంతమొందించేందుకు అమెరికా పెద్ద కసరత్తే చేసింది. ఈ అపరేషన్‌కు జో బైడెన్ జూలై 25న ఆమోదం తెలుపగా.. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం (అఫ్గానిస్థాన్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.18 గంటలకు) విజయవంతంగా చేపట్టారు. జవహరీ కాబుల్‌లోని తన నివాసంలో బాల్కనీలో ఉండగా.. రెండు హెల్ఫైర్ క్షిపణులు అతడిని లక్ష్యంగా చేసుకొని మట్టుబెట్టాయి. కేవలం జవహరీ మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్ చేపట్టడంతో భవనంలోని ఒక అంతస్తు మాత్రమే ధ్వంసమైంది. దాడి జరిగిన సమయంలో భవనంలోనే ఉన్న జవహరీ కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరుగలేదని బైడెన్ తెలిపారు. అఫ్గానిస్థాన్‌లో జవహరీ నివసిస్తున్న ఇంటి మోడల్‌నే అమెరికాలో ప్రత్యేకంగా తయారు చేశారు. ఇంట్లో ఉన్న తలుపులు, కిటికీలు ఇలా అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించారు. జవహరీ దినచర్యను దగ్గరుండి పరిశీలించేందుకు ఓ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ఆదివారం ఉదయం బాల్కనీలో నిల్చున్నది జవహరీ అని ఆ అధికారి నిర్ధారించిన తర్వాతే సీఐఏ డ్రోన్ ఆపరేషన్‌ను మొదలెట్టింది.
డాక్టర్ నుంచి టెర్రరిస్ట్‌గా..
1951 జూన్ 19న ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జవహరీ జన్మించాడు. అతడి కుటుంబంలో చాలా మంది వైద్యులు, స్కాలర్లు ఉన్నారు. కైరో యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసిన జవహరీ.. కంటి వైద్యుడిగా కొంతకాలం పనిచేశాడు. అయితే, చిన్నప్పటి నుంచే తీవ్రవాద భావజాలం ఎక్కువగా ఉండటంతో వైద్యుడిగా ఎక్కువకాలం కొనసాగలేకపోయాడు. 15 ఏండ్ల వయసులోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఓ ముఠాలో సభ్యుడిగా చేరాడు. మూడేండ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. వైద్య వృత్తిని వదిలేసి అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, మధ్య ఆసియా, మధ్య ప్రాశ్చ్య దేశాల్లో ఉగ్రవాదుల ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యాడు. ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్‌తో పరిచయమైంది. లాడెన్ ప్రారంభించిన అల్‌ఖైదా ఉగ్రముఠా రూపకల్పనలో జవహరీ కీలక పాత్ర పోషించాడు. జవహరీని లాడెన్‌కు కుడిభుజంగా చెప్తారు. అల్‌ఖైదాకు విరాళాలు సేకరించడంలో జవహిరీ కీలక భూమిక పోషించేవాడు. ఈజిప్టులో పలు ఆత్మాహుతి దాడులు, కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై భీకర దాడులు, 2001 సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్లపై దాడులు, 2005లో లండన్‌లో ఉగ్రదాడులు.. ఇలా పదుల సంఖ్యలో ఉగ్రదాడులు జరిపి వేలమందిని లాడెన్, జవహరీ పొట్టనబెట్టుకున్నారు. 2011లో లాడెన్ అంతమయ్యాక, అల్‌ఖైదా పగ్గాలను జవహరీ అందుకున్నాడు. అమెరికా ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న జవహరీకి అబు మహమ్మద్, అబు ఫాతిమా, మహమ్మద్ ఇబ్రహీం, అబు అబ్దుల్లా, ది డాక్టర్, ది టీచర్, ఉస్తాద్, డా.అయ్మన్ ఇలా అనేక పేర్లు ఉన్నాయి. అతడిపై ఇప్పటికే 25 మిలియన్ డాలర్ల రివార్డును కూడా అమెరికా ప్రకటించింది.
సీక్రెట్ హెల్ఫైర్‌తో టార్గెట్ ఫినిష్
జవహరీ ఆపరేషన్ జరిగిన సమయంలో అదే ఇంట్లో ఉన్న అతని కుటుంబ సభ్యులకు ఏ మాత్రం హాని తలపెట్టకుండా, ఎలాంటి పేలుళ్లు జరుగకుండా, శబ్దాలు వినబడకుండా సీఐఏ ఎంతో చాకచక్యంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. దీని కోసం సీక్రెట్ హెల్ఫైర్ ఆర్9ఎక్స్ (నింజా బాంబ్) క్షిపణులను వినియోగించింది. ఈ క్షిపణి పొడవు 5 అడుగులు, బరువు 45 కిలోలు. సాధారణ క్షిపణుల్లాగా వీటికి వార్‌హెడ్ ఉండదు. క్షిపణి చుట్టూరా ఉన్న ఆరు పదునైన బ్లేడ్లు అత్యంత వేగంగా వెళ్లి టార్గెట్‌ను ధ్వంసం చేస్తాయి. దీంతో పేలుడు, శబ్దం అనే ప్రసక్తే ఉండదు. నిర్దేశిత లక్ష్యం తప్ప ఇతరులకు అపాయం కూడా జరుగదు. దీంతో ప్రాణ నష్టం సంభవించదు. లిబియా, సిరియా, ఇరాక్, యెమెన్, సొమాలియాపై జరిపిన సైనిక చర్యలో అమెరికా గతంలో ఈ తరహా క్షిపణిలను వినియోగించింది.
భారత్‌పై జవహరీ అక్కసు
కశ్మీర్ అంశాన్ని తరుచూ పాలస్తీనాతో పోలుస్తూ, భారత్‌కు మద్దతు ప్రకటించిన సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాలను విమర్శించడంలో జవహరీ ఎప్పుడూ ముందుండేవాడు. అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న అన్సర్ ఘజ్వాత్ ఉల్-హింద్ టెర్రరిస్ట్ గ్రూప్ 2017లో కశ్మీర్లో పురుడుపోసుకుంది. దీన్ని వెనకుండి నడుపడంలో జవహరీ కీలక పాత్ర పోషించాడు. అయితే ఉగ్రవాది జాకిర్ ముసాను తుదముట్టించడంతో ఆ గ్రూప్ కార్యకలాపాలు దేశంలో నిలిచిపోయాయి. ముస్లింలందరూ ఏకమై భారత్‌ను సొంతం చేసుకోవాలని 2014లో తొలిసారిగా జవహరీ పిలుపునిచ్చాడు. హిజాబ్ వివాదంపై గత ఏప్రిల్‌లో వివాదాస్పద ప్రకటన చేశాడు. ఢిల్లీ, ముంబై, యూపీలో ఆత్మాహుతి దాడులు చేస్తామని గత నెలలో ఓ హెచ్చరిక కూడా చేశాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

