US-Iran : ఇరాన్-అమెరికా యుద్ధం ప్రపంచ దేశాలను ఆందోళనలో నెట్టింది. అగ్రదేశాలుగా వెలుగొందుతున్న యూరప్ దేశాలు కూడా ఈ యుద్ధ ప్రభావంతో చమురు సమస్యను ఎదుర్కొంటున్నాయి. తాజా అంచనా ప్రకారం.. యూరప్ దగ్గర ఆరు వారాలకు సరిపడా మాత్రమే విమాన ఇంధనం నిల్వలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఐఈఏ (ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ) చీఫ్ ఫాతి బిరోల్ వెల్లడించారు.
ఇరాన్ యుద్ధ సంక్షోభం ఇంకొన్ని రోజులు కొనసాగితే, యూరప్ ఏవియేషన్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని అమెరికా మూసేసిన సంగతి తెలిసిందే. దీంతో యూరప్‌నకు చమురు రవాణా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చమురు అంశంపై ఫాతి బిరోల్.. మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ పరిస్థితి ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఇంధన కొరత కారణంగా విమానాల ప్రయాణాలు రద్దయ్యే పరిస్థితి ఉందన్నారు. ‘‘హార్ముజ్ జలసంధి తిరిగి తెరవకపోతే విమాన ఇంధన కొరత తలెత్తి, విమానాల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఇంధన సంక్షోభం ఎదురుకాలేదు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సంక్షోభం ఎదురుకానుంది.
హార్ముజ్ జలసంధి ఎక్కువ కాలం అందుబాటులోకి రాకపోతే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడే ఆసియా దేశాలపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. దక్షిణ కొరియా, ఇండియా, చైనా, బంగ్లాదేశ్ ముందుగా నష్టపోతాయి. తర్వాత యూరప్‌పై ప్రభావం ఉంటుంది’’ అని బిరోల్ అన్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.