కైరో, మే 24 : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందనే బలమైన ఆశల నడుమ చర్చలు నిర్మాణాత్మకంగా, క్రమబద్ధంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు. సమయం మనకు అనుకూలంగా ఉన్నందున ఒప్పందం విషయంలో తొందరపడవద్దని తన ప్రతినిధులకు సూచించినట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆయన ఒక పోస్ట్ చేస్తూ ‘ఒప్పందం కుదిరి, ధ్రువీకరించి, సంతకం చేసే వరకు ఇరాన్‌పై దిగ్బంధం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇరు పక్షాలు తగిన సమయం తీసుకుని దానిని సమర్థంగా చేయాలి. ఎలాంటి తప్పులు ఉండరాదు’ అని పేర్కొన్నారు. ఇరాన్‌తో వాషింగ్టన్ సంబంధాలు పూర్తి స్థాయి నిర్మాణాత్మకంగా మారబోతున్నాయన్నారు. వారు అణు ఆయుధం, అణు బాంబును అభివృద్ధి చేయలేరు’ అని తెలిపారు. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందాల్లో చేరాలని కోరారు.
60 రోజుల ప్రతిపాదిత ఒప్పంద వివరాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివరించనప్పటికీ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకునే కీలక ప్రతిపాదనకు ఇరాన్ అంగీకరించిందని ఒప్పందంలో భాగస్వాములైన ఇద్దరు అధికారులు వెల్లడించారు. చర్చలు జరుగుతున్న విషయాన్ని ఇరాన్ రేడియో కూడా నిర్ధారించింది. ఇదే నిజమైతే ఇరాన్-అమెరికా యుద్ధానికి బ్రేక్ పడినట్టే. 60 రోజుల కొత్త శాంతి ఒప్పందం ప్రకారం హొర్ముజ్ జలసంధిని క్రమంగా తెరుస్తారు. అదే సమయంలో ఇరాన్ పోర్టుల దిగ్బంధాన్ని అమెరికా కూడా ఉపసంహరించుకుంటుంది. అంతేకాకుండా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేసి ఆ దేశం చమురు అమ్మకాలు యథావిధిగా కొనసాగించేలా అనుమతి ఇస్తారు. 60 రోజుల శాంతి ఒప్పందం అమలవుతున్న రోజుల్లోనే స్తంభింప చేసిన ఇరాన్ నిధుల విడుదలకు సంబంధించి కూడా చర్చలు జరుగుతాయి. ముసాయిదా ఒప్పందంలో ఇజ్రాయెల్, హెజ్బొల్లా యుద్ధ విరమణ అంశం కూడా ఉంది. తమకు కలిగే ముప్పునకు వ్యతిరేకంగా తమ కార్యాచరణను కాపాడుకుంటామని ట్రంప్‌నకు నెతన్యాహు తెగేసి చెప్పారు.
శాంతి ఒప్పందం జరిగినట్టు వస్తున్న వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఆదివారం మాట్లాడుతూ శాంతి చర్చలపై గణనీయమైన ప్రగతి ఉందని తెలిపారు. రాబోయే కొన్ని గంటల్లో శుభవార్త రావచ్చని అన్నారు.