వార్సా: పోలాండ్‌లో పది వేలకుపైగా అమెరికా సైనికులు ఉన్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ జే బ్లింకెన్ తెలిపారు. జనవరి 30కు ముందు కంటే పోలాండ్‌లో తమ దేశ సైనికుల సంఖ్య రెట్టింపు అయ్యిందని చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో పొరుగున ఉన్న పోలాండ్‌ను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సందర్శించారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పోలాండ్ కీలకంగా వ్యవహరిస్తున్నదని కొనియాడారు. ఉక్రెయిన్‌కు భద్రతా సహాయాన్ని సులభతరం చేయడానికి పోలాండ్ చాలా సహాయపడుతున్నదని తెలిపారు.
మరోవైపు తమ దేశం ఇప్పటికే ఏడు లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిందని పోలాండ్ విదేశాంగ మంత్రి తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో అనూహ్య స్థాయిలో మానవతా సంక్షోభం తలెత్తిందని అన్నారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది శరణార్థులకు సమర్థవంతమైన సహాయాన్ని అందించడం తమ ప్రాధాన్యత అని చెప్పారు. ఎక్కువ మందిని సురక్షితంగా తరలించేందుకు సాధ్యమైనదంతా చేస్తున్నట్లు వెల్లడించారు.