Strait of Hormuz : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇలాంటి సమయంలో కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా 40 వాణిజ్య నౌకల (Trade Ships) కు అమెరికా సైన్యం (US force) రక్షణ కల్పించింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 18 మిలియన్ బ్యారెళ్ల చమురును తరలిస్తున్న నౌకలు సురక్షితంగా జలసంధిని దాటినట్లు అంతర్జాతీయ మీడియా (International Media) కథనాలు వెల్లడించాయి. యుద్ధం వేళ ఒక రోజులో హర్మూజ్ మీదుగా ఇంత భారీ సంఖ్యలో నౌకలకు అమెరికా నౌకాదళం రక్షణ కల్పించడం ఇదే తొలిసారి.
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి సైనిక ఘర్షణలు చోటుచేసుకోవడంతో హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ముప్పు పెరిగింది. ఇటీవల అమెరికా బలగాలు.. ఇరాన్‌కు చెందిన రాడార్, క్షిపణి వ్యవస్థలతోపాటు తీర ప్రాంతంలోని పలు లక్ష్యాలపై దాడులు చేపట్టాయి. అటు టెహ్రాన్ కూడా ప్రతిదాడులకు పాల్పడుతోంది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ నుంచి చమురు రవాణాకు అమెరికా ఈ ఆపరేషన్ చేపట్టింది.
అయితే తాజా పరిణామాలను చూస్తుంటే యుద్ధం ముగిసే అవకాశాలు కన్పించట్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధిని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకురావడం అమెరికాకు అత్యంత కీలకంగా మారిందని విశ్లేషిస్తున్నారు. ఇదిలాఉండగా గతంలో సైనిక లక్ష్యాలపై విస్తృతంగా దాడులు చేసిన అమెరికా.. ఇప్పుడు ఈ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పును తొలగించడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.