దుబాయ్, జూలై 17 : ఇరాన్‌పై అమెరికా తన వైమానికి దాడులను శుక్రవారం తెల్లవారుజామున మరింతగా విస్తరించింది. వంతెనలు, ఇంధన క్షేత్రాలపై దాడులు జరిపిన అమెరికా ప్రధాన ఇరానియన్ రేవు చాబహార్‌లోని టవర్‌ని కూల్చివేసింది. హొర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును సడలించేలా ఒత్తిడి తీసుకురావడానికి మౌలిక సదుపాయాలపై దాడులు ప్రారంభిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలకు అనుగుణంగా సైన్యం ఈ దాడులు చేపట్టింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలపై క్షిపణి దాడులు చేసింది.
ఇరాన్‌లోని హొర్ముజ్గన్ ప్రావిన్సులో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా జరిపిన వైమానిక దాడులకు వంతెనలు కూలిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఈ దాడులలో ఏడుగురు మరణించినట్లు పేర్కొంది. మొట్టమొదటిసారి విద్యుత్ మౌలిక సదుపాయాలపై అమెరికా వైమానిక దాడులు జరిగినట్లు ఇరాన్ తెలిపింది. దక్షిణ ప్రావిన్సుల్లోని ప్రజలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చింది.

జోర్డాన్‌లో మకాం వేసిన అమెరికా సైనిక విమానాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఈ దాడులలో అనేక అమెరికన్ యుద్ధ విమానాలు, ఏరియల్ రీఫ్యూయెలింగ్ విమానం ధ్వంసం కాగా మరికొన్ని యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని ఇరాన్ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని చంపిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.96 కోట్లు)ను బహుమతిగా ఇస్తామని ఇరాన్ మద్దతు గల ఇరాక్ మిలీషియా ఐఆర్ఐ ప్రకటన చేసింది. ఇరాన్ జనరల్ ఖాసీమ్ సులేమానీ, ఇరాక్ మిలీషియా నేత అబు మహదీ అల్-ముహిందిస్లను 2020లో డ్రోన్ల దాడిలో అమెరికా చంపినందుకు ప్రతీకారంగా ట్రంప్‌ను చంపిన వారికి ఈ బహుమతి ప్రకటిస్తున్నట్టు తెలిపింది.