(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : కొత్తగా ఓ ప్రాంతానికి వెళ్లాలనుకొంటే రూట్ మ్యాప్ కోసం ముందుగా గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. ఆఫీసులో కంప్యూటర్ పని చేయాలంటే మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఉండాల్సిందే. మిత్రుడు అడిగిన వంద రూపాయలను క్షణాల్లో పంపాలంటే ‘గూగుల్ పే’ను తెరుస్తాం. వందల జీబీల డాటాను అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో స్టోర్ చేసుకొని.. అవసరమైనప్పుడు వాడుతాం. ఇలా ఒక్కటేమిటీ.. పొద్దున లేచింది మొదలు.. ముందుగా చూసుకొనే వాట్సాప్ మెసేజీ నుంచి పడుకొనేప్పుడు చివరగా చూసిన ఇన్‌స్టా రీల్ వరకూ మన జీవితమంతా టెక్నాలజీ చుట్టూ పరిభ్రమిస్తుంది. అయితే, ఉన్నట్టుండి ఈ కంపెనీలు తమ సేవలను నిలిపేశామని చెప్పాయనుకోండి. ఏమిటీ మన పరిస్థితి? ఊహిస్తేనే ఆందోళనకరంగా ఉంది కదూ. అయితే, ఆ రోజు ఎంతో దూరంలో లేదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైన్యం, ఆయుధాలు, సైబర్ ఎటాక్స్ ద్వారా ఇప్పటివరకూ జరిగిన యుద్ధాలు.. ఇకపై టెక్నాలజీ షేరింగ్‌పై ఆధారపడి నడుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆంత్రోపిక్ తాజా ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు.
ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్ తన క్లాడ్ ప్లాట్ఫామ్లో కొత్తగా విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మిథోస్ తరగతి మోడళ్లపై అమెరికా ప్రభుత్వం ఆకస్మికంగా ఆంక్షలు విధించింది. ఈ తరగతిలోని ఫ్యాబిల్ 5, మిథోస్ 5 వెర్షన్లను అమెరికన్ పౌరులకు తప్ప మరే విదేశీయులకు ఇవ్వరాదని నియంత్రణ తీసుకొచ్చింది. అమెరికాలో పనిచేసే విదేశీ వ్యక్తులకు కూడా ఈ మోడల్స్ అందుబాటులో ఉంచరాదని అమెరికా వాణిజ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రతా కారణాల పేరిట ఈ ఆంక్షలను తెచ్చింది. దీంతో ఈ సేవలను పూర్తిగా ఆంత్రోపిక్ నిలిపేసింది. కాగా ఇతర దేశాల మీద పైచేయి సాధించే ఏఐ మోడళ్లను నియంత్రణలోకి తెచ్చుకునేందుకే అమెరికా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అత్యాధునిక ఏఐ టూల్స్ వినియోగంపై ఆంక్షల నిర్ణయం భారత టెక్ కంపెనీలకు కొత్త ఇబ్బందులు తీసుకొస్తాయని నిపుణులు చెప్తున్నారు. స్టార్టప్ కంపెనీలకు అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ యాక్సెస్ ఉండబోదని, సైబర్ సెక్యూరిటీ సంస్థలు అత్యాధునిక టెక్ టూల్స్‌ను కోల్పోతాయని, దేశీయ సాఫ్ట్వేర్ సంస్థల పోటీ సామర్థ్యం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పరోక్షంగా దేశ జీడీపీపై కూడా ప్రభావం చూయించవచ్చని చెప్తున్నారు.
ఆంత్రోపిక్ ఏఐ టూల్స్‌పై తాజాగా ఆంక్షలు విధించిన అమెరికా ప్రభుత్వం.. భారతీయులు ఎక్కువగా వినియోగించే అమెరికన్ కంపెనీల సేవలపై కూడా నిషేధం విధించే అవకాశం లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్‌మీడియా వేదికలు, గూగుల్ మ్యాప్స్, గూగుల్ పే, గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్, మైక్రోసాఫ్ట్ ఓఎస్, వీసా, మాస్టర్‌కార్డ్ వంటి పేమెంట్ వేస్, మొబైల్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, అమెజాన్ వెబ్ సర్వీసులు, మైక్రోసాఫ్ట్ అజురా, గూగుల్ క్లౌడ్ వంటి క్లౌడ్ సర్వీసులు, ఓపెన్ఏఐ, ఉబర్ క్యాబ్స్ వంటి అమెరికన్ కంపెనీల సర్వీసులను ట్రంప్ సర్కార్ నిలిపేస్తే ఇండియన్స్ పరిస్థితి ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ ఓ ఆయుధంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకోవాలంటే, అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో భారత్ స్వయంసమృద్ధి సాధించాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నారు.
ఆంత్రోపిక్ మోడల్స్‌పై అమెరికా నిషేధాన్ని పలువురు టెక్ పారిశ్రామికవేత్తలు ఖండించారు. ‘ప్రపంచీకరణ చచ్చిపోయింది’ అని జోహో సంస్థ మాజీ సీఈవో శ్రీధర్ వెంబూ ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఓ ఆయుధంగా మారిపోయిందని, దేశ సార్వభౌమాధికారం, భద్రత పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడ్డాయని హెచ్చరించారు. భారత్ తన సొంతదారిని వెతుక్కోవాల్సిన సమయం వచ్చిందని సూచించారు.