Youtube Hunters | జంతువులను వేటాడుతూ హతమార్చిన వీడియోలను ఓ జంట యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నది. వీరి వీడియోలను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తమ వేటకు వందలాది జంతువులు బలైనట్లు చూపేలా ఫొటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఆ జంటకు కష్టాలను తెచ్చిపెట్టింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ కోర్టు ఒకటి వీరికి రూ.కోటికి పైగా జరిమానా విధించింది. వివరాల్లోకెళ్తే..
యునైటెడ్ స్టేట్స్కు చెందిన జోష్, సారా బౌమరి జంతువులను వేటాడుతూ.. ఆ వేట వీడియోలను యూట్యూబ్, ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలను పెద్ద సంఖ్యలో చూసేందుకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అయితే, వీరి తంతు జంతువుల వేట నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నదంటూ నెబ్రాస్కాలోని ఓ కోర్టులో పిటిషన్ నమోదైంది. దీనిపై విచారించిన నెబ్రాస్కా కోర్టు ఆ జంటకు 1,33,000 అమెరికన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1.08 కోట్లు) జరిమానా విధించింది.
లింకన్ జర్నల్ స్టార్ ప్రకారం, ఈ జంటపై సుదీర్ఘ విచారణ 39 నేరారోపణలకు దారితీసింది. జోష్, సారా బౌమరిలు అనేక చట్టవిరుద్ధమైన గేమ్ హంటింగ్ విహారయాత్రలను చేపట్టారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ జంట 2015 సెప్టెంబర్ – 2017 నవంబర్ మధ్య దాదాపు 100 జంతువులను వేటాడి చంపినట్లు సీబీఎస్ నివేదిక తెలిపింది. నెబ్రాస్కా చరిత్రలో అతి పెద్ద వేటగా పిలిచే ఈ కేసులో మొత్తం 39 మంది దోషులుగా నిర్ధారించారు. వీరు టర్కీ నుంచి ప్రాంగ్హార్న్ వరకు అనేక జంతువులను వేటాడుతూ చంపేశారని న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో తెలిపింది.