న్యూఢిల్లీ, జూలై 18 : అమెరికన్ యూనివర్సిటీలలో భారతీయ విద్యార్థుల చేరిక అత్యంత దారుణంగా పడిపోయింది. అంతర్జాతీయ విద్యార్థుల పట్ల ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 70 శాతం క్షీణించినట్లు హైదరాబాద్‌లోని విద్యారంగ కన్సల్టెంట్లు చెప్పారు. వీసా అపాయింట్మెంట్ స్లాట్లు స్తంభించిపోవడం, వీసా తిరస్కరణ శాతం పెరిగిపోవడమే ఈ క్షీణతకు కారణంగా తెలుస్తున్నది. సాధారణంగా ప్రతి ఏటా ఈ సమయానికి అధిక శాతం మంది విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలు ముగించుకుని అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. ఈ ఏడాది ఇప్పటికీ తాము స్లాట్ తెరుచుకుంటుందేమోనన్న ఆశతో ప్రతిరోజు పోర్టల్‌పై రిఫ్రెష్ కొడుతున్నామని హైదరాబాద్‌కు చెందిన ఓవర్సీస్ కన్సెల్టెంట్ సంజీవ్ రాయ్ పేర్కొన్నారు. దశల వారీగా వీసా స్లాట్లను విడుదల చేస్తామని అమెరికా అధికారులు వాగ్దానం చేసినప్పటికీ అనిశ్చితి కారణంగా విద్యార్థులలో తీవ్ర ఆందోళన ఏర్పడుతున్నది.
స్లాట్లను బుక్ చేసుకోవడంలో కృతకృత్యులైన విద్యార్థులకు కన్ఫర్మేషన్ మాత్రం అందడం లేదు. సిస్టమ్‌ని అమెరికా పరీక్షిస్తున్నందు వల్లే స్లాట్లు బుక్ చేసుకున్నా కన్ఫర్మేషన్ రావడం లేదని భావించాల్సి ఉంటుందని విండో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి చెందిన అంకిత్ జైన్ పేర్కొన్నారు. దీని ఫలితంగా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలను అన్వేషిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో స్లాట్లు ఓపెన్ కాకపోతే వేలాది మంది విద్యార్థుల కలలు కల్లలవుతాయని, అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 80 శాతం పడిపోతుందని 120 ఫీవర్ కన్సల్టెన్సీకి చెందిన అరవింద్ మండువ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రతిరోజు ఎంతో ఆందోళనతో ఫోన్ కాల్స్ వస్తున్నట్లు ఆయన చెప్పారు.
అమెరికాకు వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులపై మరో పిడుగుపాటు లాంటి పరిణామం చోటుచేసుకుంటున్నది. మార్చిలో దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు కూ డా పొందిన విద్యార్థులలో చాలామందికి ఇప్పుడు అసాధారణ రీతిలో రిజెక్షన్ లెటర్లు వస్తున్నాయి. సజావుగా అప్రూవల్స్ పొందిన విద్యార్థులకు ఇప్పుడు రిజెక్షన్ లెటర్లు వస్తున్నాయని, వారి సోషల్ మీడియా అకౌం ట్లు కూడా స్వచ్ఛంగా ఉన్నాయని, ఇందుకు కారణం 214బీ ఒక్కటేనని భావించాల్సి వస్తుందని అంకిత్ జైన్ చెప్పారు. వీసా రిజెక్షన్లకు యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని సెక్షన్ 214(బీ) సర్వ సాధారణ కారణమని చెప్పవచ్చు. ఇది కొత్త ప్రక్రియేమీ కాదని, నిబంధనలు, సోషల్ మీడియా శోధన, పరిశీలన వంటివన్నీ చాలా ఏళ్లుగా ఉన్నవేనని, అయితే ఇప్పుడు కఠినంగా అమలు అవుతున్నాయని మరో కన్సల్టెంట్ తెలిపారు.