Tariff War | బీజింగ్, ఫిబ్రవరి 4: తమ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలపై చైనా ప్రతీకార చర్యలు చేపట్టింది. అమెరికా నుంచి దిగుమతవుతున్న నాచురల్ గ్యాస్, క్రూడాయిల్ తదితర ఉత్పత్తులపై తాను సైతం సుంకాలు వేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. అయితే ఇది వచ్చే సోమవారం నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. కొన్ని వస్తువులపై 15 శాతం, మరికొన్నింటిపై 10 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది.
అంతేకాకుండా గూగుల్, ఇతర వాణిజ్య సంస్థలపై యాంటీట్రస్ట్ (బహుళ జాతి సంస్థల వల్ల కలిగే దుష్ప్రభావాల వ్యతిరేక చట్టం) దర్యాప్తును ప్రారంభించింది. సరిహద్దు భద్రత, మాదక ద్రవ్యాల రవాణాపై మెక్సికో, కెనడా ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో ఆ రెండు దేశాలపై విధించిన సుంకాల అమలును 30 రోజుల పాటు నిలిపివేయడానికి ట్రంప్ అంగీకరించారు.
అయితే చైనాపై ముందు ప్రకటించిన విధంగా మంగళవారం నుంచే వాటి అమలును ప్రారంభించారు. కాగా, సుంకాలపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ట్రంప్ కొద్ది రోజుల్లో చైనా అధ్యక్షుడు లీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపే యోచనలో ఉన్నారు. రెండు దేశాల మధ్య ట్రేడ్‌వార్ జరగడం ఇదే మొదటి సారి కాదు. 2018లో సైతం ట్రంప్ చైనా నుంచి దిగమతయ్యే వస్తువులపై టారిఫ్ పెంచగా, అప్పట్లో డ్రాగన్ దేశం కూడా దీటుగానే స్పందించింది.