US Student Visa | న్యూఢిల్లీ : అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులను రాచి రంపాన పెడుతున్నది.నిబంధనల ఉల్లంఘన పేరుతో వారి వీసాలను అడ్డగోలుగా రద్దు చేస్తున్నది. అలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 6 వేల మందికిపైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. వారిలో 4 వేల మంది చట్టాల ఉల్లంఘన, డ్రంకెన్ డ్రైవ్, దాడులు, దోపిడీ లాంటి నేరాలకు పాల్పడినట్టు పేర్కొన్నది. ‘హమాస్’ ఉగ్రవాద సంస్థకు నిధులు సమీకరిస్తున్నందుకు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం (ఐఎన్ఏ)లోని నిబంధనల కింద మరో 200-300 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ సంఖ్యలు అన్ని క్యాటగిరీల్లో పెరుగుతున్న వీసా రద్దుల్లో కేవలం ఒక భాగం మాత్రమే. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు అన్ని క్యాటగిరీల్లో కలిపి దాదాపు 40 వేల వీసాలు రద్దయ్యాయి. ఇవి అంతకుముందు జో బైడెన్ ప్రభుత్వ హయాంలో రద్దయిన 16 వేల వీసాల కంటే చాలా అధికం. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఉన్నత విద్యావ్యవస్థను పునర్వ్యవస్థీకరించే పనిలో పడిన ట్రంప్.. ప్రధాన విశ్వవిద్యాలయాలను దృష్టిలో పెట్టుకుని విధానపరమైన మార్పులు చేపట్టారు. కీలక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు కేటాయించిన నిధుల్లో భారీగా కోత విధించడంతోపాటు వర్సిటీ క్యాంపస్లలో ఆందోళనలకు దిగే విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.