వాషింగ్టన్, జూన్ 20: అమెరికా బీ స్పిరిట్ బాంబర్లు ఆదివారం ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై దాడి చేసి విజయవంతంగా వెనుదిరిగాయి. ఈ క్రమంలో ఆ అణు కేంద్రాల ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాం.
ఫోర్డో: భూగర్భంలో నిర్మించిన యురేనియం శుద్ధి కేంద్రం. ఇరాన్లో కోమ్ సమీపంలోని పర్వతం కింద దీనిని ఏర్పాటు చేశారు. ఇది టెహ్రాన్‌కు నైరుతిలో 100 కి.మీ దూరంలో ఉంది. ఇది కూడా సెంట్రిఫ్యూజ్ క్యాస్కేడ్లను కలిగి ఉంది. అయితే నతాంజ్ అంత పెద్దది కాదు. దీని నిర్మాణాన్ని 2007లో ప్రారంభించినప్పటికీ ఇరాన్ దాని గురించి బయటి ప్రపంచానికి చెప్పలేదు. అమెరికా, దాని పశ్చిమ మిత్ర దేశాలు ఈ అణు కేంద్రం గురించి ఐఏఈఏకు ఫిర్యాదు చేసిన తర్వాత దీని గురించి 2009లో మాత్రమే ఇరాన్ వెల్లడించింది.
కొండ గర్భంలో ఉన్న దీనిని విమాన నిరోధక బ్యాటరీలు నిరంతరం రక్షిస్తుంటాయి. దీనిని బంకర్ బ్లస్టర్ బాంబులు తప్ప మిగతావి ఏమీ చేయలేవని మిలిటరీ నిపుణులు తెలిపారు. సుమారు 13,600 కి.మీ బరువుండే గైడడ్ బాంబులు మాత్రమే దీనిని విచ్ఛిన్నం చేయగలవు. ఈ బాంబులను బీ2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే మోసుకుని వెళ్లగలవు. అందుకే అమెరికా ఆదివారం వాటిని ప్రయోగించింది.
నతాంజ్: ప్రధాన యురేనియం శుద్ధి కేంద్రం. పెద్ద భూగర్భ సముదాయం. అధునాతన సెంట్రీఫ్యూజ్‌లను కలిగి ఉన్నది. ఇది టెహ్రాన్ ఆగ్నేయానికి 220 కి.మీ దూరంలో ఉంది. దీనిపై ఇప్పటికే ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఇక్కడ యురేనియంను 60 శాతం వరకు శుద్ధి చేశారు. అణ్వాయుధ తయారీ స్థాయికి ఇది దగ్గరగా ఉంది. ఇజ్రాయెల్ ఇటీవల దాడిలో దానిలోని సెంట్రీఫ్యూజ్‌లు ధ్వంసమయ్యాయని, తద్వారా ఆ కేంద్రంలో అంధకారం అలుముకుందని ఐఏఈఏ తెలిపింది.
ఇస్ఫాహాన్: ఇదొక యురేనియం మార్పిడి కేంద్రం. ఎల్లోకేక్ను యురేనియం హక్సాఫ్లోరెడ్ (యూఎఫ్6) వాయువుగా ప్రాసెస్ చేస్తుంది. దానికి ఇతర కేంద్రాల్లో శుద్ధి చేస్తారు. టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 350 కి.మీ దూరంలో ఇది ఉంది. దేశ అణు కార్యక్రమానికి సంబంధించిన మూడు చైనా పరిశోధనా రియాక్టర్లు, ప్రయోగశాలలకు ఇది నిలయంగా ఉంది.