Donald Trump | న్యూఢిల్లీ : డాలర్ డ్రీమ్స్‌తో అమెరికాలో అడుగుపెట్టిన ఎన్నారైలకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు వీసా నిబంధనలు కఠినతరం చేయగా, మరోవైపు జన్మతః పౌరసత్వం రద్దు, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ వలసదారులను ఏరివేస్తూ, స్వదేశాలకు తిప్పి పంపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా పౌరసత్వం లేనివారిపై మరో పిడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా పౌరసత్వం లేనివారు తమ స్వదేశాలకు పంపే డబ్బుపై పన్ను విధించాలని నిర్ణయించారు. అంటే.. విద్యార్థులు, వర్క్ వీసాలపై పనిచేస్తున్నవారు తమ ఇంటికి డబ్బు పంపాలంటే 5 శాతం పన్ను కట్టాల్సి వస్తుందన్నమాట. ఆ దేశ దిగువ సభలో ఈ నెల 12న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో ట్రంప్ సర్కార్ ఈ ప్రతిపాదనలు పొందుపరిచింది. ఇలా వసూలైన నిధులను సరిహద్దు రక్షణకు వినియోగిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. జూలై 4 నాటికి చట్టంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రస్తుతం అమెరికాలో లక్షలాది మంది భారతీయులు వర్క్, స్టూడెంట్ వీసాలపై పని చేస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల (ఎన్నారై) ద్వారా ఏటా మన దేశానికి రూ.7.10 లక్షల కోట్ల వరకు (83 బిలియన్ డాలర్లు) డబ్బులు వస్తున్నట్టు అంచనా. ఇందులో అత్యధిక శాతం అమెరికా నుంచే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ లావాదేవీలపై ఎలాంటి పన్ను విధించడం లేదు. ఒక వేళ ట్రంప్ ట్యాక్స్ చట్టంగా మారితే.. ఇకపై ఎన్నారైలు తమ కుటుంబాలకు పంపే ప్రతి లక్ష రూపాయలకు రూ.5 వేలు పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఇది వారి ఆర్థిక ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ట్రంప్ ట్యాక్స్ మన రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఎన్నారైలు మన దేశానికి పంపే సొమ్ములో అత్యధిక శాతం రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడులుగా పెడుతున్నారు. ఇండ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు వంటివి కొనుగోలు చేస్తున్నారు. ట్రంప్ విధించే పన్నుతో అమెరికా నుంచి వచ్చే డబ్బు తగ్గిపోతుందని, ఇది హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.
జూలై 4 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆలోగానే వీలైనంత ఎక్కువ డబ్బును తమ కుటుంబాలకు పంపాలని సూచిస్తున్నారు. ఇకపై డబ్బును విడతల వారీగా పంపాలని సూచిస్తున్నారు. ఒక విడతలో 10 వేల డాలర్లకు మించితే రిపోర్ట్ ఆఫ్ ఫారిన్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్ , ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లయిన్స్ యాక్ట్ (ఎఫ్ఏటీసీఏ) పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. దీంతోపాటు ట్యాక్స్‌లకు అనుగుణంగా అమెరికాలో తమ కుటుంబ నిర్వహణ ఖర్చులను మార్చుకోవాలని సూచిస్తున్నారు.