వాషింగ్టన్ : రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. నిత్యం రష్యన్ సైన్యం ఉక్రెయిన్ నగరాలపై మిస్సైళ్లు, బాంబు వర్షం కురిపిస్తున్నది. చిన్న దేశమే అయినా మాస్కో దాడులను ఉక్రెయిన్ సైన్యం తప్పికొడుతున్నది. అదే సమయంలో యుద్ధాన్ని నిలువరించేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు పలు దేశాల సహాయం అభ్యర్థిస్తున్నది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా 200 మిలియన్ల డాలర్ల సహాయం అందించిన విషయం తెలిసిందే.
తాజాగా ఉక్రెయిన్‌కు మరణాయుధాలు అందించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. లాంగ్ రేంజ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ స్వాతంత్య్రానికి అమెరికా అండగా నిలుస్తుందని, ఉక్రెయిన్ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు అందించనున్న ఆయుధాల్లో లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ కొనుగోలుకు సహాయం అందించడంతో పాటు 9వేల యాంటీ ట్యాంక్ వెపన్స్, 7వేల తేలికపాటి ఆయుధాలు, 20 మిలియన్ రౌండ్ల మందుగుండు సామాగ్రితో పాటు వంద డ్రోన్లు అందించనున్నది.