వాషింగ్టన్, జనవరి 12: ఇటీవలి కాలంలో ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా దాడులకు పాల్పడుతున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా, బ్రిటన్ తాజాగా ముప్పేట దాడికి దిగాయి. ఎర్రసముద్రంలో ఉద్రిక్తతలు రాజేసిన హౌతీలకు చెందిన డజనుకు పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇరుదేశాల సైన్యాలు గురువారం పెద్దయెత్తున బాంబు దాడులు చేశాయి. హెచ్చరికలను హౌతీలు పట్టించుకోని నేపథ్యంలో చేపట్టిన ఈ ప్రతీకార దాడుల్లో రెండు దేశాల బలగాలు యుద్ధనౌక, జలాంతర్గామిని ఉపయోగించి టోమాహాక్ క్షిపణులను ప్రయోగించాయి. యుద్ధ విమానాలను కూడా ఉపయోగించినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. తాము దాడులు చేసిన లక్ష్యాల్లో వాయు రక్షణ, కోస్టల్ రాడార్ సైట్లు, డ్రోన్, క్షిపణి ఆయుధ నిల్వ ప్రాంతాలు, వాటి లాంచింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా, యూకే దాడుల్లో ఐదుగురు పౌరులు మరణించారని, మరో ఆరుగురు గాయపడ్డారని హౌతీలు ప్రకటించారు. యెమెన్ రాజధాని సనాలో నాలుగు పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్టులు పేర్కొన్నారు. హౌతీల నియంత్రణలోని హోడీడా పశ్చిమ పోర్టు ఏరియాలో ఐదు బలమైన పేలుళ్లు వినిపించాయని స్థానికులు చెప్పారు. తైజ్, థమార్ పట్టణాల్లో కూడా దాడులను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. తాజా పరిణామంంతో అవి మరింత తీవ్రవయ్యే అవకాశం కనిపిస్తుది.
దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ ఎర్రసముద్రంలో హౌతీల దాడులను అమెరికా, మిత్రదేశాలు సహించేది లేదని తేల్చి చెప్పేందుకు ఈ దాడులు చేసినట్టు పేర్కొన్నారు. దౌత్యపరమైన సంప్రదింపులు, చర్చల తర్వాతనే తాము ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. హౌతీ సైనిక స్థావరాలపై తమ సైన్యం దాడులు చేసిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అమెరికా, యూకే దాడులపై హౌతీ నేత మహ్మద్ అలి అల్ ఖహోమ్ తీవ్రంగా స్పందించారు. ఈ యుద్ధం పెద్దది అవుతుందని, అమెరికా, బ్రిటన్ ఊహకు అందని విధంగా ఉంటుందంటూ హెచ్చరికలు చేశారు. దాడులు మూర్ఖపు చర్య అని ఆ రెండు దేశాలు త్వరలో తెలుసుకొంటాయని మరో హౌతీ నేత అన్నారు. హౌతీ మంత్రి హుస్సేన్ అల్ ఎజ్జి మాట్లాడుతూ ఇజ్రాయెల్ నౌకలపై దాడులు ఆగవని ప్రకటించారు. అమెరికా, బ్రిటన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అమెరికా, బ్రిటన్ దాడులపై ఐరాస భద్రతా మండలిలో చర్చించాలని రష్యా అభిప్రాయపడింది.