శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 24, 2021 , 14:46:49

దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా విమాన వాహక నౌకలు

దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా విమాన వాహక నౌకలు

వాషింగ్టన్‌: అమెరికా విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించాయి. చైనా, తైవాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యూఎస్ఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్ నేతృత్వంలో అమెరికా యుద్ధ నౌకల బృందం దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలోకి ప్రవేశించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. అంతర్జాతీయ సముద్ర జలాల స్వేచ్ఛను కాపాడేందుకు, మిత్రులు, భాగస్వామ్య దేశాలకు భరోసా ఇవ్వడానికి తమ యుద్ధ నౌకలను మోహరించినట్లు అమెరికా తెలిపింది.

యూఎస్‌ఎస్‌ థియోడర్ రూజ్‌వెల్ట్‌తో పాటు టికోండెరోగా క్లాస్ గైడెడ్ క్షిపణి క్రూయిజర్ యూఎస్‌ఎస్ బంకర్ హిల్, ఆర్లీ బుర్కే క్లాస్ గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్లు యూఎస్ఎస్ రస్సెల్, యూఎస్ఎస్ జాన్ ఫిన్ ఈ బృందంలో ఉన్నాయని పేర్కొంది. కాగా, తన 30 ఏండ్ల కెరీర్ మొత్తంలో ఈ జలాల గుండా ప్రయాణించిన తరువాత, మళ్ళీ సాధారణ కార్యకలాపాల కోసం దక్షిణ చైనా సముద్రంలో ఉండటం చాలా బాగున్నదని అమెరికా విమాన వాహక నౌకల బృందం కమాండర్‌ రియర్ అడ్మిరల్‌ డగ్ వెరిసిమో తెలిపారు. 

మరోవైపు దక్షిణ సముద్రంలోని తమ దీవులపై చైనా పెత్తనం చెలాయించడాన్ని తైవాన్‌తోపాటు వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనై దేశాలు ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ సమాజానికి ఫిర్యాదు చేశాయి. తైవాన్ ప్రతాస్ దీవుల పరిసరాల్లోని తమ గగన తలంలోకి  చైనా వైమానిక బాంబర్లు, యుద్ధ విమానాల చొరబాట్లపై తైవాన్‌ ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా దాడుల బృందాలు దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించాయని యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్­లోడ్ చేసు­కోండి

VIDEOS

logo