రియాధ్, ఫిబ్రవరి 18 : రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా మరో ముందడుగు పడింది. మంగళవారం సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా విదేశాంగ శాఖ మంత్రులు మార్కో రుబియో, సెర్గేయ్ లావ్రోవ్ సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఇరు దేశాలు ఉన్నత స్థాయి బృందాలను నియమించాయి. యుద్ధాన్ని ముగించడంతో పాటు అమెరికా – రష్యా సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో ఇరు దేశాల మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా – రష్యా చర్చల తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమ్మతి లేకుండా తమపై రుద్దే రాజీ ఒప్పందాన్ని ఉక్రెయిన్ అంగీకరించబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చల నేపథ్యంలో ఈ వారం జరగాల్సిన తన సౌదీ పర్యటనను మార్చికి వాయిదా వేసుకున్నారు.
అమెరికాపై ఆధాపడకుండా సొంత సైన్యాన్ని నిర్మించుకోవాలని ఐరోపా దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరి క్రమంగా మారుతున్న నేపథ్యంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. మ్యూనిచ్ భద్రతా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అమెరికా నుంచి ఇక మీదట ఐరోపాకు కచ్చితమైన భద్రతా సహకారం అందకపోవచ్చని, ఐరోపా ప్రయోజనాలకు రక్షణ ఉంటున్న తన సంప్రదాయ పాత్ర నుంచి అమెరికా వెనక్కు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. రష్యా కొత్తగా 1.5 లక్షల మందిని సైన్యంలో నియమించుకుంటున్నదని, బెలారస్లో బలగాలను మోహరిస్తున్నదని, ఐరోపా భద్రతకు ఇది ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. అయితే, ఐరోపాకు ప్రత్యేక సైన్యం ఉండాలని జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనను ఐరోపా దేశాలు తోసిపుచ్చాయి.