Hezbollah | బీరుట్, సెప్టెంబర్ 18: లెబనాన్‌లో మరోసారి అనూహ్య పేలుళ్లు సంభవించాయి. మంగళవారం ఒకేసారి వందలాది పేజర్లు పేలిపోగా, బుధవారం వైర్లెస్ పరికరాలైన వాకీ టాకీలు, రేడియోలు పేలిపోయాయి. స్మార్ట్ఫోన్లు, ఇంటర్‌కామ్‌లు, సోలార్ ప్యానళ్లు సైతం పేలిపోతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. రాజధాని బీరుట్ సహా తూర్పు, దక్షిణ లెబనాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో హెజ్బొల్లా సభ్యులే లక్ష్యంగా ఏకకాలంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 14 మంది మరణించారు. 300 మంది వరకు గాయపడ్డట్టు తెలుస్తున్నది. దహియే ప్రాంతంలో పేజర్ల పేలుళ్లలో మరణించిన వారి అంత్యక్రియలు జరుగుతుండగా ఓ పేలుడు సంభవించింది. పేలిన వాకీ టాకీలు, రేడియోలను ఐదు నెలల క్రితం కొనుగోలు చేశారు. కాగా, ఈ పేలుళ్లకు ఇజ్రాయెలే కారణమని, పేజర్లు, వాకీటాకీల్లో ఆ దేశ నిఘా సంస్థ మొస్సాద్ పేలుడు పదార్థాలు అమర్చిందని హెజ్బొల్లా ఆరోపించింది. కాగా, మంగళవారం నాటి పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించారని, 2,800 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫిరాస్ అబైద్ ప్రకటించారు. మరోవైపు, ఈ దాడి తర్వాత అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చిందని, పేజర్లలో స్వల్ప మోతాదులో పేలుడు పదార్థాలు అమర్చి ఉన్నట్టు అమెరికాకు చెందిన ఓ అధికారి అనధికారికంగా వెల్లడించారు. ఈ పేలుళ్లపై ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు. లెబనాన్‌లో రెండురోజులుగా పేలుళ్లు జరుగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం సమావేశం కావాలని నిర్ణయించింది.
లెబనాన్‌లో పేలిన ఏఆర్-924 రకం పేజర్లను తాము తయారు చేయలేదని తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో సంస్థ ప్రకటించింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌కు చెందిన బీఏసీ కన్సల్టింగ్ అనే సంస్థ వీటిని తయారు చేసిందని, తమ బ్రాండ్‌తో విక్రయించిందని పేర్కొన్నది.