వాషింగ్టన్ : సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా శనివారం మరోసారి దాడులు చేసింది. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. గత నెలలో సిరియాలో ఐసిస్ దాడుల్లో తమ దేశ సైనికులు ఇద్దరు, తమ పౌరుడు ఒకరు మరణించడంతో ఈ ప్రతీకార దాడుల చేపట్టింది. శనివారం ‘ఆపరేషన్ హాక్ఐ’ పేరుతో ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు ఆ దేశ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
‘మా సందేశం ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుంది. మా సైనికులకు మీరు హాని కలిగిస్తే, మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా కనిపెట్టి చంపుతాం. మీరు న్యాయం నుంచి ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం ఉండదు’ అని కమాండ్ ఒక ప్రకటనలో హెచ్చరించింది.