న్యూయార్క్, ఫిబ్రవరి 25 : ఉక్రెయిన్‌కు అమెరికా షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. తమ దేశ భూభాగం నుంచి రష్యా వైదొలగాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐరాసలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా, దాని మిత్ర దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. మరోవైపు చాలా యూరప్ దేశాలు తీర్మానానికి మద్దతు పలకడంతో అది ఆమోదం పొందింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటేయడం ఇదే తొలిసారి. ఐరాస సాధారణ అసెంబ్లీలో ఈ తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు ఓటేయగా, 18 దేశాలు వ్యతిరేంచాయి. భారత్ సహా 64 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఇంకోవైపు ఈ తీర్మానంలో ‘రష్యా దురాక్రమణ’ అనే విషయాన్ని ప్రస్తావించకుండా చేయాలని అమెరికా చేసిన ప్రయత్నాన్ని ఐరాస తిరస్కరించింది.